ప్రజా వ్యతిరేకతను పట్టించుకోని బిజెపి
పెట్రో ధరల దాడి కొనసాగుతూనే ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఇంతగా అంటే మోడీ ఏడేళ్ల పాలనలో పెరిగినంతగా ఎప్పుడూ పెరగలేదు. అలాగే గ్యాస్ ధరలు కూడా అంతే స్పీడుగా పెరిగి పోయాయి. గ్యాస్ ధరలు దాదాపు ఈ ఏడేళ్లలో రెట్టింపు అయ్యింది. అయినా ప్రభుత్వంలో ఎక్కడా కించిత్ పాశ్చాత్తాపం కలగడం లేదు. మోడీ పాలనలో కేవలం కార్పోరేట్ శక్తులు బలపడుతున్న తీరు ప్రజలను కలచి వేస్తోంది. పేద,సామాన్య ప్రజలు ఎంతగా చితకి పోతున్నారో గమనించడం లేదు. జిఎస్టీ కారణంగా వస్తువుల ధరలు పెరిగితే ఎవరికి నష్టమో ఆలోచన చేయడం లేదు. దేనిని వదలకుండా జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చినంత మాత్రాన, ప్రభుత్వ ఆదాయం పెరిగినంత మాత్రాన ఆర్థిక సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయంటే ఎవరిని వంచించడానికి అన్నది ఆలోచన చేయాలి. జిఎస్టీతో దేశాన్ని ఏకం చేశామని వాదిస్తున్నవారికి ప్రజలపై పడుతున్న భారం కానరావడం లేదు. పెట్రో ధరల పెరుగుదలపైనా మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ప్రజలు తమ సంపాదనంతా పెట్రోలు పైనే ఖర్చుపెట్టకున్నా ..ఈ ధరల కారణంగా ఇక అన్ని రకాల సరుకులపై ధరలు గుట్టుచప్పుడు కాకుండా పెరుగుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సమస్యలపై స్పందించే గుణం లేకుండా పోయింది. దివంగత మాజీప్రధాని పివి నరసింహారావు పుణ్యమా అని ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణలు దేశ ప్రజలను గడపదాటి బయటకు వెళ్లేలా చేశాయి. ప్రజలు ప్రపంచాన్ని చూసేలా చేశాయి. ప్రపంచం భారత్ వైపు చేశాయి. మన మార్కెట్లు జోరందుకున్నాయి. సరళీకృత ఆర్థిక విధానాలు సామాన్యుడికి కడుపునిండా భోజనం పెట్టేలా చేశాయి. ప్రతి వస్తువును కొనుగోలు చేసేలా చేశాయి. కానీ మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయి. అయినా కిందిస్థాయిలో ఏం జరుగుతందో తెలుసుకోలేని ప్రధాని మోడీ కేవలం తాను అనుసరించిన ఆర్థిక విధానాలను ప్రజలు ఆమోదించారంటూ ప్రచారాం చేసుకుంటున్నారు. ప్రతి ఎన్నకల్లోనూ తామే గెలుస్తామని చెప్పుకోవడం ఆత్మవంచన తప్ప మరోటి కాదు. సంస్కరణలు ప్రజలు ఆమోదిస్తే, ప్రజలు బాగుపడితే బెంగాల్లో ఎందుకు వ్యతిరేక గాలి వీచిందో ఆలోచన చేయాలి. ధరల పెరుగుదలతో ఎందుకు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారో గమనించాలి. మోడీ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నచందంగా ఉన్నారే తప్ప పరిస్థితులను విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకుంటామని ప్రకటించడం లేదు. ప్రజా నాయకులైతే ఇలాంటి విధానాలు పరిశీలన చేసుకోవాలి. ప్రజల్లో నివురుగప్పిన అసంతృప్తిని గమనించి సర్దుకోకపోతే బిచాణా ఎత్తేయాల్సి ఉంటుందని గమనించాలి. ప్రజలు తమ అసంతృప్తులను వేర్వేరు సందర్భాల్లో తెలియచేస్తున్నా గమనించడం లేదు. ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని తొలగించలేకపోతున్నామని గమనించడం లేదు. నోట్ల రద్దు, జిఎస్టీ, పెట్రో ధరలపై ఏనాడూ ప్రధాని పెదవి విప్పడం లేదు. ఏడేళ్లయినా ఇంకా కేవలం రాహుల్‌ను, కాంగ్రెస్‌ను తిట్టిపోస్తూ రాజకీయం చేయడమే పాలన కాదు. పాలనలో కొత్త ఒరవడి సృష్టించాలి. ప్రజలకు మేలు జరిగేల సంస్కరణలు ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఆహరధాన్యాల ధరలు తగ్గాలి. సంస్కరణలంటే ఇవే తప్ప మరోటి కాదని గుర్తుంచుకోవాలి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ధరలను, నేటి మార్కెట్ ధరలను ఎందుకు బేరీజు వేసుకోవడం లేదో ప్రధాని మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలి. మోడీ అనుసరిస్తున్న నిరంకుశ విధానాలు ప్రస్తుతం ప్రజల ఆలోచనలు కాంగ్రెస్ వైపు మళ్లేలా చేస్తోందని గుర్తించాలి. ఇకముందు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి సవాలు ఎదురవుతుందని భావించాలి. దానికి కాంగ్రెస్ గొప్పతనం కాకుండా మోడీ అనుసరిస్తున్న పిడివాద సంస్కరణల ఫలితమని గుర్తించాలి. రాహుల్ గాంధీ
పార్టీ అధ్యక్ష స్థానాన్ని అలంకరించినా..అలంకరించకపోయినా మోడీ వ్యతిరేకత బాగా కలసి వస్తుంది. గతంలో మన్మోహన్ అచేతనావస్థ మోడీకి కలసి వస్తే ఇప్పుడు ..కూడా మోడీ నిరంకుశ విధానాలు కాంగ్రెస్‌కు కలసి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత మోడీ విధానాల కారణంగా ప్రజలు రాహుల్‌లో నాయకత్వ లక్షణాలను గుర్తిస్తున్నారు. పివి నరసింహారావు లాగా సంస్కరణలు ప్రజలకు ఎందుకు మేలు చేయలేక పోతున్నాయో మోడీ పరిశీలన చేయాలి. ఇప్పటికైనా నోట్లరద్దు,జిఎస్టీ విపరిణామాలను విశ్లేషించుకోవాలి. విమర్శలను హెచ్చరికగా తీసుకుని ముందుకు సాగితే తప్ప మనలేమని గుర్తించి ప్రజలకు మేలుచేసే పనులను చేపట్టి అమలు చేయాలి. అప్పుడే బిజెపి తన అస్తిత్వాన్ని నిలుపుకోగలదు. లేకుంటే 19 రాష్టాల్ల్రో అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఉంటే అది ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టదని గుర్తుంచు కోవాలి. అధికారానికి దూరంగా ఉంటూ వ్యవస్థాగత నిర్మాణం విచ్ఛిన్నమైపోయివున్న స్థితిలోనూ కాంగ్రెస్ గతంలో కంటే మెరుగ్గా ఉందంటే అందుకు మోడీ పుణ్యమే తప్ప కాంగ్రెస్ గొప్పతనమేవిూ లేదని గుర్తించాలి. ప్రధానిగా మోడీ అనుసరించిన విధానాలు కూడా ప్రజలకు రుచించక పోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్టి గూడుట్టుకుని ఉంది. బీజేపీ గ్రావిూణ ప్రాంతాలవారి ఆదరణకు దూరమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిరది. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదా అన్నదే గీటురాయి. వాటిపట్ల ప్రజలు సంతృప్తిగా ఉంటే ప్రజారంజక పాలన సాగుతున్నట్లే. అవి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రజల స్థితిగతులను పరిశీలన చేయాలి. సిద్దాంతాల ప్రాతిపాదికన రాజకీయాలు చేసే పార్టీగా బిజెపికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ప్రధాని నరేంద్రమోదీ నవభారతాన్ని ఆవిష్కరిస్తామని, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తామని అన్న మాటలు వమ్ము చేశారు. పేదలు, అణగారిన వర్గాలు తమ జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దుకునే దేశాన్ని తయారు చేయాలన్న సంకల్పం నెరవేర్చడంలో రాజీపడడం ఎందుకన్నదానికి సమాధానం రావాలి. ఈ దేశంలో పేదలు తమకోసం ఏదో ఒకటి జరగాలని కోరుకుంటున్నారు. తమకు కొత్త అవకాశాలు రావాలని, తమ బతుకులు బాగు పడాలని చూస్తున్నారు.