ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయండి

నోటీసులు జారీ చేసిన జనగామ పోలీసులునోటీసులు జారీ చేసిన జనగామ పోలీసులు
కరీంనగర్  బ్యూరో ( జనం సాక్షి ) :
బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర నిలిపివేయాలంటూ పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు వర్ధన్నపేట ఏసిపి నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో ఇతర జిల్లాల నుండి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని నోటీసులో తెలిపిన పోలీసులు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని తెలిపారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.
* ఎన్ని ఆంక్షలు పెట్టినా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది
ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, ఆంక్షలు విధించిన పాదయాత్రను కొనసాగిస్తామని పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిలు  తెలిపారు. గత మూడు విడతలుగా పాదయాత్రలు పోలీసుల అనుమతితోనే కొనసాగించే విషయం మర్చిపోకూడదు అన్నారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకో పోలీసులు తెలిపాలి అన్నారు. భద్రకాళి పాదాలచెంత పాదయాత్ర ముగిస్తామని తెలిపారు. ఈనెల 27న ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతారని వెల్లడించారు. కెసిఆర్ తాటాకు చప్పుళ్ళను పట్టించుకునేది లేదన్నారు