ప్రజ్వల్..వెంటనే పోలీసులకు లొంగిపో..
న్యాయ ప్రక్రియను ఎదుర్కోవాల్సిందే
ఇది నా అర్డర్..మనవడు ప్రజ్వల్‌కు దేవేగౌడ హెచ్చరిక
బెంగళూరు,మే 23 (జనంసాక్షి) :: రాసలీల వీడియోల్లో అడ్డంగా దొరికిపోయిన తన మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వెంటనే భారత్ తిరిగి వచ్చి.. పోలీసులకు లొంగిపోవాలని అతడి తాత, మాజీ ప్రధాని దేవగౌడ సూచించారు. లేకుంటే తన ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుందని ప్రజ్వల్‌ను ఆయన హెచ్చరించారు. మై వార్నింగ్ టు ప్రజ్వల్ రేవణ్ణ పేరుతో గురువారం ఎక్స్ వేదికగా తాను రాసిన లేఖను దేవగౌడ పోస్ట్ చేశారు. నీవు నా సహనాన్ని పరీక్షించవద్దు. ఎక్కడ ఉన్నా తిరిగి రావాలి. న్యాయ పక్రియను ఎదుర్కోవలసి ఉందని ప్రజ్వల్‌కు ఈ సందర్బంగా దేవగౌడ సూచించారు. అయితే ఈ లేఖ ద్వారా ప్రజ్వల్‌ను తాను అభ్యర్థించడం లేదని.. హెచ్చరిస్తున్నానని దేవగౌడ స్పష్టం చేశారు. ఈ విషయంలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని సైతం ప్రజ్వల్ ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. తనపై అతడికి ఏ మాత్రం గౌరవం ఉన్నా వెంటనే తిరిగి రావాలని ఆకాంక్షించారు. గత కొన్ని వారాలుగా తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల ప్రజలు చాలా ఆగ్రహంతో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ వారిని ఆ ఆరోపణలు చేయవద్దని వారించనని చెప్పారు. అలాగే వారితో వాదనలకు దిగే ప్రయత్నం కూడా
చేయనని తెలిపారు. కానీ ప్రజ్వల్ వ్యవహారంలో నిజాలు వెలుగులోకి వచ్చే వరకు తాను వేచి చూస్తానని దేవగౌడ అన్నారు. అదే విధంగా ప్రజ్వల్ చేసిన పనులు తనకు తెలియదంటూ ప్రజలను బుజ్జగించే ప్రయత్నం సైతం తాను చేయనని స్పష్టం చేశారు. ప్రజ్వల్ విదేశీ ప్రయాణం సంగతి కూడా తనకు తెలియదని ఈ సందర్బంగా దేవగౌడ తెలిపారు. కానీ తన మనసాక్షికి జవాబు చెప్పుకోవాల్సి ఉందన్నారు. ఆ దేవుడినే నమ్ముతానని.. వాస్తవమేమిటన్నది ఆ దేవుడికే తెలియాలని దేవగౌడ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల వేళ.. జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీల వీడియోలు వేలాదిగా బహిర్గతమయ్యాయి. అయితే అవి బహిర్గమైన వెంటనే.. ప్రజ్వల్ జర్మనీ వెళ్లిపోయారు. దీంతో ఎన్నికల వేళ.. ప్రజ్వల్ వ్యవహారం ప్రతిపక్షాలకు ఆస్త్రంగా మారాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కలిసి కర్ణాటకలో పోటీ చేస్తున్నాయి. ఆ క్రమంలో ఆ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఇండియా కూటమిలోని పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించాయి. ఇక ప్రజ్వల్ రేవణ్ణను భారత్‌కు తీసుకు వచ్చేందుకు కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.