ప్రణబ్‌ దా ప్రసంగం అద్భుతం

చరిత్రలో నిలిచిపోతుందని అభినందించిన అద్వానీ

న్యూఢిల్లీ,జూన్‌8(జనం సాక్షి ): మాజీ రాష్ట్రప్రతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరెస్సెస్‌ కార్యాలయంలో చేసిన ప్రసంగం భారత ఆధునిక చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ అన్నారు. భారత జాతీయత ఆదర్శాలను ప్రణబ్‌ అద్భుతంగా వివరించారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రణబ్‌ను పిలిచిన మోహన్‌ భగవత్‌ను, ఆయన ఆహ్వానాన్ని మన్నించిన ప్రణబ్‌ను కొనియాడారు. ఇద్దరి అభిప్రాయాలు దాదాపు ఒకేలా ఉన్నాయన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా ఆరెస్సెస్‌ చీఫ్‌ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగుతున్నాయని అద్వానీ ఆనందం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యల వల్ల అందరూ కలలుగన్న భారత్‌ సాకారం కావడానికి కావాల్సిన సహనం, సామరస్యం, సహకారం లభిస్తాయన్నారు. ఆరెస్సెస్‌ ఆహ్వానాన్ని మన్నించి ప్రణబ్‌ తన గొప్పతనాన్ని చాటుకున్నారని చెప్పారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం కారణంగా ప్రణబ్‌ గొప్ప రాజనీతిజ్ఞుడిగా ఎదిగారన్నారు. దేశంలోని వివిధ సిద్దాంత, రాజకీయ వర్గాల మధ్య చర్చలు, సహకారం ఎంతో అవసరమని, దానికి చర్చలు దోహదం చేస్తాయని ప్రణబ్‌ నమ్ముతారు అని అద్వానీ తెలిపారు.