ప్రతి ఒక్కరూ గ్రంథాలయాల్లో చదివే అలవాటు చేసుకోవాలి

– జిల్లా పౌర సంబంధాల అధికారి ఎంఏ. రషీద్
వనపర్తి ప్రత్యేక ప్రతినిధి,నవంబర్17 (జనం సాక్షి)
ప్రతి ఒక్కరు గ్రంథాలయాల్లో పుస్తకాలు,పత్రికలు చదివే అలవాటు చేసుకోవాలని వనపర్తి జిల్లా పౌర సంబంధాల అధికారి ఎంఏ.రషీద్ అన్నారు.గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని స్థానిక గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని,విద్యార్థులు పుస్తకాలు,పత్రికలు చదవడం వల్ల ఎంతో జ్ఞానం వస్తుందని, వాటితోపాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని చెప్పారు.చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయని,దేశం, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రంథాలయాలు జ్ఞాన సంపదను అందిస్తాయని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి శ్రీనివాసులు,తెలుగు పండిట్ దానయ్య, సిబ్బంది రంగస్వామి, వెంకటేశ్వరమ్మ, చెన్నయ్య, చైతన్య, పాఠకులు పాల్గొన్నారు