ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌: దేశంలో ఉన్న 15కోట్ల మంది బాలలు ప్రతి ఒక్కరూ 10మొక్కల చొప్పున నాటితే భారతదేశం సస్యశ్యామలంగా మారుతుందని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం అన్నారు. సెంటర్‌ ఫర్‌ ఎన్విరాస్‌మెంట్‌ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ పర్యావరణ రక్షణ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కలాం ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. భారత దేశాన్ని వేదిస్తున్న సమస్యల్లో కాలుష్యం ప్రధానమైందని..దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే మొక్కలు నాటి దేశాన్ని పచ్చదనం చేయడం ఒక్కటే మార్గమని కలాం అభిప్రాయపడ్డారు. భావి భారత పౌరులు ఈ విషయాన్ని గుర్తించి పరిసర ప్రాంతాలను కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చకుండా ప్రతి ఒక్కరూ ఉన్న మొక్కలను రక్షించడం కొత్త మొక్కలను నాటడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. పదేళ్లుగా తానున పర్యావరణ రక్షణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. భారత్‌కు పర్యావరణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న అబ్దుల్‌ కలాం సెంటర్‌ ఫర్‌ ఎన్విరాస్‌మెంట్‌ అవార్డులను అందజేయడంపై నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తమ పర్యావరణ రక్షణకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉత్తమ పాఠశాలల అవార్డులను, పదివేల రూపాయల నగదు బహుమతిని సీఈఈ తరపున కలాం అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ జిల్లాల పర్యావరణ స్టాల్స్‌ను కలాం ప్రారంభించారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు కేంద్రంలో కలాం మొక్కను నాటారు.

తాజావార్తలు