ప్రతి పేదవాడికి డబుల్‌బెడ్‌రూం ఇల్లు

– రైతుబంధుతో దేశంమొత్తం తెలంగాణవైపు చూస్తుంది
– రాష్ట్ర మంత్రి మహేమందర్‌రెడ్డి
– మాసన్‌పల్లిలో రెండు పడక గదుల ఇళ్లకు శంకుస్థాపన
రంగారెడ్డి, మే26(జ‌నం సాక్షి) : ప్రతి పేదవాడు తలెత్తుకొని జీవించేలా తెరాస పాలన సాగుతుందని,  దీనిలో భాగంగా ప్రతి పేదవానికి డబుల్‌బెడ్‌రూం ఇల్లు కట్టించి ఇవ్వటం జరుగుతుందని రాష్ట్ర మంత్రులు మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డిలు అన్నారు. జిల్లాలోని షాద్‌నగర్‌ నియోజకవర్గం కేశంపేటలో మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. కోటి 72 లక్షలతో కేశంపేట, రామకృష్ణాపురం బీటీ రోడ్డు పనులను, బ్రిడ్జీని మంత్రులు ప్రారంభించారు. అదేవిధంగా కేశంపేటలో దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎంపీపీ విశ్వనాథ్‌, సంతాపూర్‌ మాజీ సర్పంచ్‌ రాములు, 500 మంది కాంగ్రెస్‌, టీడీపీ కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మహేశ్వరం మండలం మాన్‌సన్‌పల్లిలో 2,412 రెండు పడక గదుల ఇళ్లకు మంత్రి మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవానికి మేలు జరిగేలా కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. తాజాగా అమలు చేసిన రైతుబంధుతో సన్న, చిన్నకారు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. రైతులకు పంటల సాగు సమయంలో పెట్టుబడి ఖర్చుకోసం గతంలో వడ్డీవ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరిగేవారని, కానీ ప్రస్తుతం తెరాస హయాంలో పెట్టుబడి ఖర్చు కోసం ఎకరాకు రూ. 4వేల ఇవ్వటం వల్ల రైతుల ఇబ్బందులు తొలిగాయన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ బండారు భాస్కర్‌ పాల్గొన్నారు.