ప్రత్తికి మద్ధతు ధర కేంద్రమే నిర్ణయించాలి
వరంగల్,అక్టోబర్20(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర కల్పించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ విషయంలో కేంద్రానిదే బాధ్యతన్నారు. పత్తికి మద్దతు ధర కేంద్రం పరిధిలో ఉందని కడియం తెలిపారు. హన్మకొండలో ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతాంగాన్ని మోసం చేసేది బీజేపీ-టీడీపీలు మాత్రమేనన్నారు. కేంద్ర ప్రభుత్వ బాధ్యత లేదన్నట్లుగా బిజెపి నేతలు మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వరంగల్ ఉప ఎన్నిక రానుండడంతో అన్ని పార్టీలకు దీనిపై ప్రేమ పుట్టుకొస్తోందన్నారు. వరంగల్‌పై ప్రతిపక్షాలకు ఇప్పుడు ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తోందని ఆయన ఎద్దేవాచేశారు. అందుకే వారి పాలనా కాలంలో చేయని పనులను కూడా ప్రస్తావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాదరణ ఏ పార్టీకి ఉందో వరంగల్ ఉప ఎన్నికలో తేలిపోతుందని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. విపక్షాలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నాయన్నారు. ఎన్నికల హావిూలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ దోపిడీని చూసి ప్రజలు ఆ పార్టీని కనుమరుగు చేశారని కడియం అన్నారు. పత్తి కొనడానికి మార్గదర్శకాలు లేవు. కేంద్రం పత్తికి కనీస మద్దతు ధర కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవినీతి, అక్రమాలు వెన్నతో పెట్టిన విద్య. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం శాంతి చర్చల పేరుతో నక్సలైట్లను ఏరివేసింది. రైతుల ఆత్మహత్యలను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. వాటర్‌గ్రిడ్‌పై కాంగ్రెస్ నేతల ఆరోపణలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ హయాంలో వందలమందిని ఎన్‌కౌంటర్ చేయలేదా అని ప్రశ్నించారు. చర్చల పేరుతో నక్సల్స్ స్థావరాలు తెలుసుకొని చంపలేదా అని నిలదీశారు. పచ్చని తెలంగాణ కోరుకుంటున్నామని, నెత్తుటి తెలంగాణను కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాదరణ ఏ పార్టీకి ఉందో ఉపఎన్నికల్లో తెలిసిపోతుందన్నారు. 60ఏండ్లలో ప్రతిపక్షాల పాలనలో చేయని అభివృద్ధిని 60 నెలల్లో చేసి చూపించే బాధ్యత తమదేనని ధీమా వ్యక్తం చేశారు. మాపాలన బాగాలేకుంటే ప్రజాకోర్టు ఉంది, వారే తీర్పునిస్తారు. అంతే తప్ప పనికిమాలిన ప్రతిపక్షాల పసలేని వాదనలను పట్టించుకోమన్నారు.