ప్రధాని కావాలని ఉంది మాయ మనుసులో మాట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి):
సార్వత్రిక ఎన్నికలు ఇంకా కొన్ని నెలల్లో ముంగిటకు రానున్న కాలంలో రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలకు సైతం ఊపిరిపోస్తున్నారు. అందరికళ్లు, అన్ని పార్టీలు ప్రధాని పదవిపై కన్నేసి ఉంచాయి. ఏకపార్టీకి ప్రజలు అధికారమిచ్చే రోజులు పోయాయి కాబట్టి వచ్చేది కూటమి ప్రభుత్వాలే. కూటమిలో బలమైన భాగస్వామ్య పక్షంగా ఎదిగి ప్రధాని పదవిని కొట్టేయాలని అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే యూపీయే, ఎన్డీయే కూటములకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ తమ ప్రధాని అభ్యర్థులు వీరంటూ నరేంద్రమోడీ, రాహుల్‌ పేర్లను నాయకుల పేర్లతో ప్రకటనలను గుప్పిస్తూనే ఉంటున్నారు. నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థి అయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమంటూ జాతీయ స్థాయి నాయకులు ఓ వైపు చెబుతూనే మరోవైపు ఎన్నికల తరువాత అన్నీ భాగస్వామ్య పక్షాలు నిర్ణయిస్తాయంటూ అదే పార్టీలోని మరో వర్గం జాతీయ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇక యూపీయేకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు భావి ప్రధానిగా యువనేత రాహుల్‌ గాంధీ దాదాపు రంగంలోకి దిగినట్టే. ఇదిలా ఉండగా సెప్టెంబర్‌లోగా ప్రభుత్వం కూలటం ఖాయమని సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలంటూ, ఈ ఎన్నికలలో మూడో ఫ్రంట్‌ అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా తాము రంగంలో ఉన్నట్టూ యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌ ప్రకటించారు. తాజాగా ఇదే రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీగా యూపీయేకు ఊపిరి ఆగిపోయినప్పుడల్లా ఆక్సీజన్‌ అందిస్తూ ఆదుకునే బీఎస్పీ అధినేత్రి మాయావతి తనను ప్రధాన పదవికి పంపాలని కార్యకర్తలకు నిర్దేశం చేశారు. మొత్తానికి మన దేశంలో ప్రధాని పదవి ఇంతగా దిగజారిపోయిందన్నమాట. సరిగ్గా 20 ఏళ్లకు వెనక్కువెళితే దేశంలో యూనైటెడ్‌ ఫ్రంట్‌ అదే తదనంతర కాలంలో నేషనల్‌ ఫ్రంట్‌గా రూపాంతరం చెంది వీపీ సింగ్‌, ఐకే గుజ్రాల్‌, దేవేగౌడ లాంటి నేతలకు ప్రధాని అయ్యే యోగ్యత లభించింది. నేషనల్‌ ఫ్రంట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పుతున్న సమయంలో ప్రధాని పదవి వామపక్ష పార్టీలో పెద్దన్నగా పేరొందిన సీపీఎంకు దాదాపు అందుకునే దగ్గరగా వచ్చింది. ఆ రోజుల్లో చిన్నాచితకా పార్టీలన్నీ నేషనల్‌ ఫ్రంట్‌గా జతకట్టి వీటన్నింటినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ప్రధాని పదవిని కాంగ్రెస్‌, బీజీపీలకు వెళ్లకూడదనే కృతనిశ్చయంతో ఆనాడు పాతికేళ్లుగా పశ్చిమబెంగాల్‌లో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మిగిలిన పార్టీలైన ఫార్వర్డ్‌ బ్లాక్‌, సీపీఐ తదితర వాటిని కూడగట్టుకుని ప్రభుత్వాన్ని 25 ఏళ్లుగా నడుపుతున్న రాజకీయ కురువృద్ధుడు జ్యోతిబసును ప్రధాని పదవి అధిష్టించాల్సిందిగా ముక్తకంఠంతో కోరాయి. కాని ఆ పార్టీ సంస్థాగత నిర్ణయంలో వచ్చిన వ్యతిరేకత వల్ల జ్యోతిబసు ప్రధానపదవిని అధిష్టించలేకపోయారు. సీపీఎంలోని ఒక వర్గం జ్యోతిబసు ప్రధాని పదవిని అధిష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. తదనంతరం జ్యోతిబసు దీనిపై సీపీఎం చారిత్రాత్మక తప్పిదం చేసిందంటూ బహిరంగ వేదికలపైనే విమర్శించడం జరిగింది. ఆనాడు అనుకోకుండా కాళ్లదాక వచ్చిన అదృష్టాన్ని దక్కనీయకపోవడంతో జ్యోతిబసు అలా మాట్లాడుతున్నారని విమర్శించిన వారూలేకపోలేదు. సీపీఎంను చూసి జాలిపడిన వారు లేకపోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీలు సంస్థాగతంగా చక్కదిద్దుకుంటూనే వచ్చే ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిపెట్టండంటూ అప్పుడు ప్రధాని హోదాలో ఎర్రకోట నుంచి స్వాతతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేస్తామంటూ లోక్‌సభలో రెండంకెల సీట్లు దాటిన ప్రతిపార్టీ అభిలషిస్తోంది. భవిష్యత్తు దృశ్యాన్ని కార్యకర్తల ముందు ములాయం సింగ్‌, మాయావతి లాంటి వారు ఆవిష్కరిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు సమస్య ప్రధానమంత్రి గురించి కాదని, పార్టీ వ్యవస్థ గురించి అని ఏ ఒక్క పార్టీ కూడా గుర్తించడంలేదు. తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా చూడొద్దంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మొత్తుకుంటున్నా మెహర్బాని కోసం అధినేత్రి ప్రాపకం కోసం పాకులాడే భజన పరులు ఇటీవల కాలంలో కాంగ్రెస్‌లో మరీ ఎక్కువయ్యారు. ఈ విధంగా దేశంలో అత్యున్నత స్థానమైన ప్రధాని పదవి కుర్చీలాటగా మారిపోయిందంటే ఔరా..! అని అనిపిస్తోంది.