ప్రధాని పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

4

– పర్యవేక్షించిన మంత్రి హరీశ్‌

మెదక్‌,జులై 30(జనంసాక్షి):మెదక్‌ జిల్లాలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఆగస్టు 7న ‘మిషన్‌ భగీరథ’ తొలిదశను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మెదక్‌ జిల్లా గజ్వేల్‌ మండలం కోమటిబండ వద్ద హెలిప్యాడ్‌, సభాస్థలి ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రధాని పర్యటన ఏర్పాట్లను హరీశ్‌రావు పరిశీలించారు. ఇక్కడి నుంచే అనేకకార్యక్రమాలనుప్రధాని ప్రారంభిస్తారు. కరీంనగర్‌ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన కొత్తపల్లి – మనోహరబాద్‌ రైల్వేలైన్‌కు ఆగస్టు 7న ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ ప్రకటించారు. రైల్వే లైన్‌ భూసేకరణ పనులు పూర్తి కావొచ్చాయి, పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయని కరీంనగర్‌లో తెలిపారు. గజ్వెల్‌ నుంచే రిమోట్‌ ద్వారా శంకుస్థాపనచేస్తారు. పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వచ్చే భక్తులకు కొత్తపల్లి – మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణలో అతితక్కువ రైల్వేలైన్లు ఉన్నాయి, కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. చిన్న జిల్లాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. జిల్లాల ఏర్పాటు అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు అని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే ప్రధాని మోదీ రాష్ట్రపర్యటనకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అన్నిశాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం ఆయన తన నివాసంలో సవిూక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్‌, మెదక్‌ కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌, మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐఎల్‌, రైల్వే అధికారుకు తగిన సూచనలు చేశారు. ఆరు కార్యక్రమాలు ఒకేరోజు నిర్వహిస్తున్నందున ఏర్పాట్లను వెంటనే చేపట్టి రెండు రోజుల ముందే అన్ని సన్నాహాలు పూర్తి చేయాలన్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, పీయూష్‌ గోయల్‌, తోమర్‌, అనంతకుమార్‌, ప్రధాన్‌, సురేష్‌ప్రభు తదితరులు వస్తున్నారు. మిషన్‌భగీరథను ప్రారంభించి, బహిరంగసభలో పాల్గొంటారని, మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌, రామగుండం ఎరువుల కర్మాగారం, కాళొజీ ఆరోగ్య వర్సిటీలకు శంకుస్థాపన చేస్తారని, జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ ప్లాంటును జాతికి అంకితం చేస్తారని సీఎం చెప్పారు. వీటికి సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. ప్రధాని పర్యటన భద్రత, ఇతర అంశాల గురించి చర్చించారు.