ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం 

– స్వర్ణ పతకాన్ని కైవసంచేసుకున్న అనాహిమ్‌
– దేశానికి గర్వకారణం- రాష్ట్రపతి
కాలిఫోర్నియా,నవంబర్‌30(జ‌నంసాక్షి) : అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడింది. ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం దక్కింది. కాలిఫోర్నియాలోని అనాహిమ్‌ పట్టణంలో జరుగుతోన్న పోటీల్లో భారత్‌కు చెందిన విూరాబాయ్‌ చాను స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. కరణం మల్లీశ్వరి తర్వాత ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన రెండో క్రీడాకారిణిగా చాను నిలిచింది. 1994, 1995లో కరణం మల్లీశ్వరి స్వర్ణం సాధించింది. 48 కేజీల విభాగంలో పాల్గొన్న 23 ఏళ్ల చాను మొత్తం 194 (స్నాచ్‌ 85, క్లీన్‌అండ్‌ జెర్క్‌-109)కేజీలు ఎత్తి సరికొత్త రికార్డు సృష్టించి స్వర్ణం దక్కించుకుంది. థాయ్‌లాండ్‌, కొలంబియాకు చెందిన క్రీడాకారిణీలు రజతం, కాంస్య పతకాలు అందుకున్నారు. స్వర్ణ పతకం అందుకునేందుకు పోడియం వద్దకు వెళ్లే సమయంలో చాను ఉద్వేగానికి లోనైంది. మణిపూర్‌కు చెందిన చాను గత ఏడాది రియో ఒలింపిక్స్‌కు భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఐతే తుది పోరుకు అర్హత సాధించడంలో విఫలమైంది.
చానూ.. దేశానికి గర్వకారణం – రాష్ట్రపతి
ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో స్వర్ణపతకం సాధించిన విూరాబాయి చానును చూసి దేశం గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. దేశానికి పసిడి పతకాన్ని తెచ్చిపెట్టిన ఆమె క్రీడాస్ఫూర్తిని కొనియాడారు. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణం సాధించిన ఆమెకు అభినందనలు తెలిపారు. అద్భుతమైన మహిళా క్రీడాకారిణిని ఈ దేశానికి అందించిన మణిపూర్‌ రాష్టాన్ని రాష్ట్రపతి అభినందించారు.