ప్రపంచ సృష్టికర్త అయిన విశ్వకర్మ ప్రతిఒక్కరికీ పూజ్యుడు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి బ్యూరో సెప్టెంబర్17 (జనం సాక్షి)
చేతివృత్తులు, హస్త కళలకు ఆది గురువు, ప్రపంచ సృష్టికర్త అయిన విశ్వకర్మ ప్రతిఒక్కరికీ పూజ్యుడు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతి వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తో కలిసి స్వయంభూ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు పనిముట్లు, మహిళలు ధరించే ఆభరణాలు, గృహిణులు వాడే ఇలపీట మొదలుకొని అన్ని పరికరాలు విశ్వకర్మ కులాల వారు తయారు చేస్తారని తెలిపారు. బంగారు ఆభరణాలు, అద్భుతమైన విగ్రహాలు చెక్కడం సైతం విశ్వకర్మ కులాల వారే చేస్తారని తెలిపారు. విశ్వకర్మ నిత్య పూజారులని అభివర్ణించారు. తెలంగాణ ఆవిర్భావం లో విశేషంగా కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రికాంతా చారి సైతం విశ్వకర్మ కులస్తులే అని గుర్తు చేశారు.
అనంతరం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను జిల్లా అధికారులు, సిబ్బందికి పంపిణీ చేశారు. కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం మట్టి గణపతులు పెట్టమని ప్రోత్సహిస్తుందని తెలిపారు. బి.సి. సంక్షేమ శాఖ ద్వారా మట్టి గణపయ్యలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ అర్. లోక్ నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి, అదనపు కలెక్టర్ యస్. తిరుపతి రావు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పి. రమేష్ గౌడ్, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్యమసుందర్ చారి, జిల్లా బి సి. సంక్షేమ అధికారి బిరం సుబ్బా రెడ్డి, ఆర్డీవో పద్మావతి, జిల్లా అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.