ప్రబలుతున్న వ్యాధులు-ప్రజలు బెంబేలు
ఆదిలాబాద్, జూలై 31 : జిల్లాలో ప్రబలుతున్న వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రతి వర్షాకాలంలో మారుమూల గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి అతిసారా, మలేరియా, డయేరీయా తదితర వ్యాధులు సోకడంతో పలువురు మృతి చెందుతున్న విషయం తెలిసిందే. అనేక మంది మంచాల బారిన పడుతున్నారు. అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఖండాల గ్రామ పంచాయితీ పరిధిలోని పోతగూడా గ్రామంలో అతిసారా వ్యాధి సోకి నలుగురు మృతి చెందారు. జిల్లా కేంద్రంలో ఈ పరిస్థితి ఉంటే మారుమూల గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. గ్రామాల్లో అతిసారా వ్యాధి సోకడంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లుతున్నారు. గత వారం రోజులుగా సరైన వైద్యం లభించక గ్రామీణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సేవల విషయమై చర్చించి సమీక్ష సమావేశాలు నిర్వహించిన గ్రామాల్లో సోకుతున్న వ్యాధులను అరికట్టడం కాని, ప్రజలకు సరైన వైద్య సేవలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్వత్ర ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడం, క్లోరినేషన్ చేయకపోవడం, మంచినీరు సరఫరా కాకపోవడంతో కలుషిత నీరు తాగి ప్రజలు వివిధ వ్యాధుల భారిన పడుతున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో గాని, వైద్య సేవలు అందించడంలో అధికారులు శ్రద్ద చూపకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగక బాధ్యత గల ప్రజాప్రతినిధులు లేకపోవడం ప్రజల పరిస్థితి తెలుసుకొని అధికార దృష్టికి తీసుకురావడం లేదు. ఇప్పటికైన ప్రభుత్వం కళ్లు తెరచి యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని గ్రామీణులు కోరుతున్నారు.