ప్రబోధానం వర్గీయులే రాళ్లదాడికి దిగారు
– పోలీసులు తుపాకులు, లాఠీలకన్నా కాళ్లకు పనిచెప్పారు
– అధికారుల వైఫల్యం కారణంగానే ఘర్షణ జరిగింది
– చంద్రబాబుకు చెప్పాల్సిందంతా చెప్పా
– ఆయన తొందరగా ఏదీ తేల్చే వ్యక్తికాదు
– విలేకరుల సమావేశంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్19(ఆర్‌ఎన్‌ఎ) : చిన్న పొడమలలో పోలీసుల వైఫల్యం కారణంగానే భారీ స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఆశ్రమంలోని ప్రబోధానంద వర్గీయులు రాళ్లదాడి చేస్తుంటే తుపాకులు, లాఠీలు ఉన్న పోలీసులు తమ కంటే ముందు పారిపోయారని విమర్శించారు. వారు కనీసం ధైర్యంగా నిలబడి గాల్లోకి కాల్పులు జరిపినా ఇంత విధ్వంసం జరిగేది కాదన్నారు. బుధవారం సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి విూడియాతో మాట్లాడారు. చిన్నపొడమలలో శాంతిభద్రతల పరిరక్షణలో స్థానిక పోలీసులు దారుణంగా విఫలమయ్యారని జేసీ ఆరోపించారు. ఆశ్రమానికి కిలోవిూటర్ దూరంలో తాను ధర్నాకు దిగానని వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ తాను రోడ్డుపై కూర్చుంటే ఒక్క పోలీస్ అధికారి కూడా అక్కడకు రాలేదనీ, తమను పట్టించుకోలేదని జేసీ విమర్శించారు. 15-20 ఏళ్ల క్రితం ఎర్రటోపీ పెట్టుకుని పోలీసులు ఊర్లో అడుగుపెడితే.. మట్కా, నాటు సారా, ఇతర చట్ట వ్యతిరేక పనులు చేసేవాళ్లు పరారయ్యేవారని జేసీ తెలిపారు. ప్రస్తుతం అనంతపురంలోని పోలీస్ కానిస్టేబుల్ కాలర్ ను ఓ వ్యక్తి పట్టుకుంటే ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేని పరిస్థితికి అధికారులు దిగజారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. పోలీసులు గాల్లో కాల్పులు జరిపి ఉన్నా, చిన్నపొడమలలో ఇంత ఘర్షణ జరిగేది కాదని జేసీ తేల్చిచెప్పారు. ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులపై ఐదు సార్లు చుట్టుపక్కల గ్రామస్తులు ఫిర్యాదు చేసినా, మంగళవరం వరకూ పోలీసులు పట్టించుకోలేదని వెల్లడించారు. ఆశ్రమంలోకి పోలీసులు ఈ రోజు చేపట్టిన తనిఖీల్లో ఆయుధాలు దొరికాయని జేసీ తెలిపారు. ముందగా ప్రబోధానంద వర్గీయులే తమపై దాడులకు పాల్పడ్డారని అన్నారు. మేమంతా సమయమనంతో ఉన్నామని తెలిపారు. ఈ విషయంపై చంద్రబాబుకు అన్ని విషయాలను వివరించానని తెలిపారు. స్వామిజీకి చెందిన కొన్ని వీడియో క్లిప్పులకు సంబంధించిన పెన్ డ్రైవ్‌ను కూడా సీఎంకు ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబుకు చెప్పాల్సిందంతా చెప్పానని అనంతలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తేల్చాల్సింది ¬ంమంత్రి చినరాజప్పేనంటూ జేసీ వ్యాఖ్యానించారు. ప్రభోదానంద బలవంతుడు కాబట్టే తనపైనే దాడి చేయగలడని జేసీ అన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఆశ్రమంలో నిర్మాణాలు చేపట్టారు. దొంగరేషన్ కార్డులు, దొంగ ఆధార్ కార్డులు ఆశ్రమంలో ప్రింట్ చేస్తున్నారని జేసీ ఆరోపించారు. ప్రబోధానంద ఓ స్వామిజీ.. జగన్ ఓ నాయకుడు.. అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి రిపోర్టులు తెప్పించుకున్నారని.. చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారని జేసీ వివరించారు.