ప్రభుత్వంపై విమర్శ దేశద్రోహమేమీ కాదు: సుప్రీం

61461325818_625x300దేశద్రోహ కేసులపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా విమర్శలు చేయడం దేశద్రోహమేమి కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై దేశద్రోహం లేదా పరువునష్టం కేసులు పెట్టడం సరికాదని వెల్లడించింది. ఇటీవల చాలా కేసులు దేశ ద్రోహం కింద నమోదవుతున్న నేపథ్యంలో 1962లోని దేశ ద్రోహ చట్టాన్ని పరిగణలోకి తీసుకున్న దీపక్ మిశ్రా, యూయూ లలిత్తో కూడిన బెంచ్ ఈ కేసులపై క్లారిటీ ఇచ్చింది. దేశ ద్రోహ కేసుల అంశాన్ని మళ్లీ పునఃసమీక్షించాల్సినవసరం లేదని వెల్లడించిన బెంచ్, 54 ఏళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం ఏవైతే గైడ్లైన్సు రూపొందించిందో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అవే గైడ్లైన్సును పాటించాలని ఆదేశించింది. కేదర్ నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులోని 1962 తీర్పును పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు, రాసే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుందని వెల్లడించింది. ఇవి విమర్శల రూపంలోనైనా, కామెంట్ల రూపంలోనైనా ఉండొచ్చని క్లారిటీ ఇచ్చింది.
ప్రభుత్వానిపై విమర్శలు ప్రజల్లో హింసను ప్రేరేపించే ఉద్దేశ్యంతో చేసేవి కావని తెలిపింది. దేశద్రోహ నేరం కింద కేసు నమోదుచేయాలంటే రెండు ముఖ్యమైన అంశాలు దానిలో ఉండాలని బెంచ్ పేర్కొంది. ఒకటి ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్ర, రెండు ప్రజాశాంతికి కావాలనే దురుద్దేశపూర్వకంగా భంగం కలిగించడం, హింసను ప్రేరేపించేలా ఉన్నప్పుడు మాత్రమే వాటిని దేశద్రోహ కేసులుగా పరిగణించాలని తెలిపింది. ఐపీసీ సెక్షన్ 124ఏ దుర్వినియోగంపై కోర్టులు జోక్యం చేసుకోవాలని కోరుతూ అడ్వకేట్ ప్రశాంత్ భూషన్ అభ్యర్థిస్తూ ఎన్జీఓ కామన్ కాజ్ కింద సుప్రీంను ఆశ్రయించారు. 1962 తీర్పుపై పోలీసులకు సరిగా అవగాహన లేకపోవడంతో ఈ కేసులను నమోదుచేస్తున్నారని ఆయన చెప్పారు.  ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం 2014లో 47 కేసులు దేశద్రోహం కింద కేసులు నమోదవ్వగా.. 58 మంది అరెస్టు అయినట్టు ఈ పిటిషన్లో పేర్కొన్నారు.