ప్రభుత్వం నెత్తిన కౌలురైతుల సమస్య

రైతుబంధు పథకాన్ని కౌలురైతులకు ఇచ్చేది లేదని, కేవలం భూమి ఉన్న వారికే ఆర్థిక సాయం అందచేస్తామని ఇటీవలే సిఎం కెసిఆర్‌ మరోమారు స్పష్టం చేశారు. అందుకే పాస్‌ పుస్తకాల్లో కూడా ఖాస్తుదారు అనే కాలం ఎత్తేశామని అన్నారు. దీనిని కౌలు రైతులకు అమలు చేయాలని విపక్షాలు సైతం డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే రైతుబంధు పథకం కేవలం భూమి ఉన్న వారికే అని సిఎం కెసిఆర్‌, ప్రభుత్వం పదేపదే చెబుతూనే ఉంది. ఈ మేరకే మార్గదర్శకాలు నిర్దేశించింది. కౌలు రైతులు కేవలం భూమి తీసుకుని సాగు చేయడం వరకే పరిమితంగా చూస్తోంది. భూమి ఉన్న వారికి, కౌలురైతులకు మధ్య పంచాయితీ పెట్టదల్చుకోలేదని రైతుబీమాకు సంబంధించి ఎల్‌ఐసితో కుదరిన ఒప్పంద సమయంలో స్పష్టం చేశారు. అయితే బీమా కూడా పట్టాదారు పుస్తకం ఉన్న రైతులకే వర్తింప చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో ఇప్పుడు కౌలు రైతులకు బీమా కూడా దక్కుతుందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు కౌలురైతులకు అధికారికంగా భూములను ఇవ్వడానికి రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఇది రానున్న రోజుల్లో కొత్త సంక్షోభానికి దారితీస్తుందని వ్యవసాయరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కౌలు రైతులకు అధికారికంగా భూములు ఇవ్వకుండా, పెట్టుబడి సాయం అందకుండా, బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే, ప్రభుత్వం బీమా కల్పించకపోతే…కౌలు రైతు కాడి పక్కన పడేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగదు. భూములు పడావుపడి కొత్త సమస్య ఉత్పన్నం కాగలదని, కొత్త సామాజిక సమస్య ఏర్పడగలదని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని సామాజిక కోణంలో చూడాల్సి ఉందని అంటున్నారు. నిజంగానే సిఎం కెసిఆర్‌ కూడా ఈ దిశగా ఆలోచన చేయాల్సి ఉంది. ఇకపోతే తాజా ప్రతిపాదనల నేపథ్యంలో వీరంతా రైతులగానే ఉన్నా బీమా కూడా దక్కకపోతే కష్టమే అన్న అనుమానాలు ఉన్నాయి. ఇది ఓ రకంగా వీరిని పూర్తిగా విస్మరించడమే కాగలదు. వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు రైతుబంధుతో ఇక పండగే.. అంటున్నా భూమిలేదన్న మెలిక కారణంగా కౌలు రైతులను పట్టించుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద రైతులు మాయమై చిన్న, సన్నకారు రైతులే వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. భూస్వాముల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వీరు లక్షల్లో ఉన్నా కనీస ప్రభుత్వ పరమైన గుర్తింపు లేకపోవడంతో ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో కౌలు రైతులకు రూ.4 వేలు దక్కలేదు. ఇక బీమా కూడా దక్కుతుందా అన్నది కూడా అనుమానంగానే ఉంది. దీంతో వీరు ఏం చేయాలన్నది తెలియడం లేదు. ఏటా ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో కౌలు రైతులే అధికంగా ఉంటున్నారు. కౌలుదారుడికి న్యాయం జరగకపోతే వ్యవసాయం ముందుకు సాగుతుందా అన్నది కూడా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఏ ప్రయోజనం లేనప్పుడు ఎందుకు వ్యవసాయం చేయాలని కైలు రైతులు భావిస్తే మొత్తానికే మోసం రాగలదని గుర్తుంచుకోవాలి. దీంతో వ్యవసాయరంగానికి, ఆహార భద్రతకు తీరని ముప్పువాటిల్లగలదు. వ్యవసాయ రంగ నిపుణులు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ సాయం అందక, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటల్లో నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ భూములు ఉన్న వారికే కాకుండా కౌలు రైతులకు కూడా బ్యాంకు రుణాలు అందించాలని గత ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. వారికి ప్రతి ఏడాది గడువుతో రుణ అర్హత పత్రాలను అందించింది. ఏడాది ముగిసినతర్వాత మళ్లీ తిరిగి విూ సేవలో ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే తమకు రుణ అర్హత కార్డులు ఇవ్వకుండా భూ యజమానులు అడ్డుపడుతున్నారని వారు ఆందోళనకు గురవుతున్నారు. కార్డులు మంజూరు చేసి బ్యాంకు రుణమైనా అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నిజానికి చాలామంది కౌలు రైతులకు ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. భూ యజమాని వద్ద తెల్ల కాగితంపై రాసుకొని కౌలుకు వ్యవసాయం చేస్తున్నారు. భూ యజమానులు ఇప్పుడు పక్కాగా రాసి కౌలుకు భూములు ఇవ్వడం లేదు. నోటిమాటగా భూములు కౌలుకు రాసిస్తున్నారు. పలువురు కౌలు రైతులు భూయజమానుల మాటల విూద భరోసాతోనే సాగు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం సాగు చేసుకొని భూమి యజమానికి డబ్బులు చెల్లించాలి. కౌలుకు భూమి ఇచ్చినట్లు రాతపూర్వకంగా ఒప్పందానికి భూమి యజమాని ముందుకు రావడం లేదు. నిబంధనల ప్రకారం బాండ్‌ కాగితంపై కౌలుకు ఇచ్చినట్లు రాయించుకోవాలి. రెవెన్యూ అధికారులు గుర్తింపు కార్డులు అందించడం లేదు. బ్యాంకర్లు గుర్తింపు కార్డులు ఉంటేనే రుణాలు అందిస్తామంటున్నారు. కార్డులు లేక రుణాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు.దీంతో బ్యాంకు అధికారులు వారికి రుణాలు ఇవ్వడం లేదు. రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తున్నారు. లక్షల హెక్టార్లలో కౌలు రైతులు పంటలను సాగు చేస్తున్నారు. కొందరు భూ యజమానులకు ఒప్పందం ప్రకారం ముందే కౌలు చెల్లించాలి. బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతుబందు కింద పెట్టుబడి అందడంతో ప్రస్తుం రైతులు భూములను ఇతరులకు కైలుకు ఇచ్చినట్లుగా చూపడం లేదు. కౌలు రైతుకు యజమాని పట్టా పుస్తకాలు ఇవ్వడానికి నిరాకరిస్తుండటంతో ఏం చేయలేని కౌలురైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు డబ్బులుతెచ్చి అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. తమ సొంత భూముల ద్వారా కౌలు రైతులు రుణాలు తీసుకోవడానికి ఎక్కువ మంది భూ యజమానులు నిరాకరిస్తున్నారు. దీంతో వారికి రుణాలు అందడం లేదు. భూ యజమానులు అనుమతి లేక రుణాలు పొందలేని వారికి ప్రభుత్వ కొత్త జీవో కష్టాలు తెచ్చిపెట్టింది. రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకు అధికారుల మధ్య సమన్వయ లోపం కౌలు రైతుల పాలిట శాపంగా మారింది. సాగుచేసే వారికి అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గుర్తింపు అర్హత కార్డులు ఉన్న వారికి కూడా బ్యాంకులు మొండిచేయి చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కార్డు ఉండి అప్పు కోసం బ్యాంకుకు వెళ్తే పట్టా రైతు నుంచి పాస్‌ పుస్తకం తీసుకురావాలని నిబంధన పెడుతున్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే వర్షాలు లేకపోవడం, పంటలకు తెగుళ్లు సోకడం, ఇతరత్రా కారణాల వల్ల దిగుబడులు తగ్గి పంటలో నష్టం వచ్చినా భూ యజమానికి మాత్రం ముందుగా ఒప్పందం చేసుకున్న కౌలు చెల్లించాల్సిందే. దీంతో కౌలు రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. తాజాగా ప్రభుత్వం రైతుబంధు పథకం వీరిని మరింత ఊబిలోకి నెట్టింది.