ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్- 2లో డిజిటల్ విద్యా బోధన

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మనఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ – 2 లో 8, 9, 10వ విద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించడానికి ఐఎఫ్పీ
(ఇంటరాక్ట్ ప్లాట్ ప్యానెల్ ) బోర్డులు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆ పాఠశాల హెచ్ఎం అంకతి వెంకన్న మాట్లాడుతూ దృశ్య, శ్రవణ విధానంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తే సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు పాఠంలోని అంశాలను సులభంగా గుర్తుంచుకునే అవకాశం ఉందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టడంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో బోధన కొనసాగుతుందని తెలిపారు.పాఠాలు డిజిటల్‌ విధానంలో కూడా అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.డిజిటల్ విధానంలో విద్యార్థులకు పాఠాలు తేలికగా అర్థమయ్యేలా, పలు విధాలుగా ప్రయోగాలు చేసేందుకు, నూతన విషయాలు తెలుసుకునేందుకు, సంక్షిష్ట విషయాలు తేలికగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.డిజిటల్ స్క్రీన్ పాఠాలకు సంబంధించిన అంశాలను విద్యార్థులు కోరుకున్న భాషలో చదివి వినిపిస్తుందన్నారు. ఇలాంటి బోర్డులను ప్రభుత్వ పాఠశాలల్లోని అన్ని తరగతుల విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

తాజావార్తలు