ప్రభుత్వ కార్యక్రామలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి: ఎమ్మెల్యే

మెదక్‌,జూన్‌28(జ‌నం సాక్షి): గడపగడపనా టీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేయాలని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు మరికొద్ది రోజులోనే రానున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. పంచాయతీ ఎన్నికలే కాకుండా సాధారణ ఎన్నికలతో సహా ఏ ఎన్నికలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. ఆసరా పింఛన్‌ నుంచి మొదలు ఇటీవల రైతుబంధు, రైతుబీమా వరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. ప్రజలకు కార్యకర్తలు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. అప్పుడే టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతం అవుతుందని, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పథకాల పట్ల ప్రజలు చైతన్యవంతం అవుతారని పేర్కొన్నారు. బూత్‌, గ్రామస్థాయిలో టీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అప్పుడే టీఆర్‌ఎస్‌ పార్టీ పునాది పటిష్టంగా ఉంటుందన్నారు. బూత్‌స్థాయి కార్యకర్తలు పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉందని, తిరుగులేని నాయకత్వంతో ముందుకు సాగుతుందన్నారు. ఊహకందని అభివృద్ధితో తెలంగాణ దూసుకుపోతుందన్నారు. కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని, వారికి పార్టీ అండదండలు ఎప్పటికి ఉంటాయని తెలిపారు.