ప్రభుత్వ ఖర్చుతో ధర్మదీక్షలు చేస్తారా

– టీడీపీ, వైసీపీకి ధీటుగా బీజేపీని బలోపేతం చేస్తాం
– రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతాం
– దేశంలో మోదీకి ధీటైన ప్రతిపక్షం లేదు
– ఫ్రంట్‌లు, కూటములతో మోదీని అడ్డుకోలేరు
– కాంగ్రెస్‌ – టీడీపీ దోస్తితో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌
– ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కన్నా
– చంద్రబాబు అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకు ప్రధానిపై విమర్శలు
– బాబు తప్పుడు ప్రచారాన్ని ఎండగడతాం
– ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు, మే26(జ‌నం సాక్షి) : చంద్రబాబునాయుడు సమస్య వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, ప్రభుత్వ ఖర్చులతో ధర్మదీక్షలు చేయడమేంటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ పేర్కొన్నారు. శనివారం గుంటూరులోని గుంటూరు సిద్దార్థ గార్డెన్స్‌లో ఎన్డీయే నాలుగేళ్ళ పాలన విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సభలో పాల్గొన్న రాంమాధవ్‌ ప్రసంగిస్తూ… రాష్ట్రంలో టీడీపీ, వైసీపీకి ధీటుగా బీజేపీని బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో నూతన రాజకీయ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టిందని, రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతామని ఆయన అన్నారు. కేంద్రంలో అస్థిర ప్రభుత్వం ఉండాలని టీడీపీ కోరుకుంటోందని, ఏపీలో వంశపారపర్య పాలన, కుల రాజకీయాలు నడుస్తున్నాయని రాంమాధవ్‌ పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్‌, జేడీఎస్‌ గెలుపునకు తామే కారణమంటూ టీడీపీ చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడి కంటే కన్నా లక్ష్మీనారాయణకు రాజకీయ అనుభవం ఎక్కువని, కన్నా మచ్చలేని రాజకీయ నాయకుడన్నారు. దేశంలో మోదీకి ధీటైన ప్రతిపక్షం లేనేలేదన్నారు. ఫ్రంట్‌లు, కూటముల పేరుతో మోదీని అడ్డుకోలేరని, ఫ్రంట్‌లో నలుగురైదుగురు ప్రధానమంత్రి అభ్యర్థులు తయారయ్యారని, నాలుగేళ్ల తర్వాత కూడా మోదీకి జనాదరణ తగ్గలేదని రాంమాధవ్‌ అన్నారు. అలాగే మోదీని అవినీతిపరుడని చేసే శక్తి ఎవరికీ లేదన్నారు. మాతో కలిసి పనిచేయలేక కొందరు వెళ్లిపోతున్నారని, ఏపీకి మేం అన్యాయం చేశామని దుష్పచ్రారం చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేక శక్తిగా ఆనాడు ఎన్టీఆర్‌ టీడీపీని స్దాపించారని, కానీ.. చంద్రబాబునాయుడు – కాంగ్రెస్‌ దోస్తీతో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఏపీలో నూతన ఒరవడి సృష్టించబోతున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ లాంటి వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతామన్నారు. విజయవాడలో మహనాడు ఫ్లెక్సీలు అన్ని వారసత్వంతో నిండిపోయాయని, టీడీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన అన్నారు. బీజేపీపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడతామని ఆయన అన్నారు.
చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని ఎండగడతాం – కన్నా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకు ప్రధానిపై
అసత్యప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగడతామని ఆంధప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అంతకు ముందు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు బాధ్యతలను నూతన అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే… కక్షపూరిత వాతావరణం నెలకొందన్నారు. కూటమిలో ఉంటూనే టీడీపీ…బీజేపీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దుష్పచ్రారం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతగానితనంతో కేంద్రంపై నిందలు వేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా ప్రధాని 24గంటల పాటు నిరంతరం పని చేస్తున్నారని కన్నా పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని ఎండగడతామని తెలిపారు. అల్మట్టి పేరుతో ఆంధప్రదేశ్‌ రాష్ట్రం నోట్లో మట్టి కొట్టిన దేవెగౌడను చంద్రబాబునాయుడు కౌగిలించుకోవడం దారుణమన్నారు. బీజేపీపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్ధ నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, పార్టీ మహిళా నేత పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు హాజరయ్యారు.