ప్రభుత్వ పథకాలపై అవగాహన పెరగాలి
రంగారెడ్డి,మే31: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. వాటికి సంబంధించి పూర్తిస్థాయి అవగాహన ప్రజాప్రతినిధులకు ఉన్నప్పుడే ప్రజలకు తెలియచేయగలరన్నారు. పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరాలంటే తప్పనిసరిగా అన్ని వర్గాలకు అవగాహన ఉండాలన్నారు. ఇందుకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని,కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, గ్రామ సభలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే ఉత్తమ ఫలితాలు రావడంలేదని ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అవగాహన కల్పించడంలో అధికారయంత్రాంగం విఫలమవుతోందని, ప్రణాళికబద్ధంగా ఈ పక్రియ చేపట్టాలని ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి పథకాలను ప్రజలకు చేరవేయాలని స్పష్టం చేశారు. జాతీయ జీవనోపాధుల పథకం ద్వారా నిరుపేద కుటుంబానికి ఏడాదిలో రూ.50వేల అదనపు లబ్ధి చేకూర్చాల అన్నారు. వాటర్‌షెడ్ పథకాలను త్వరితంగా పూర్తిచేసేందుకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. భుగర్భజలాలను పెంపొందించేందుకు ఐదెకరాల పొలం ఉన్న రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. పొలంలోనే చెరువును ఏర్పాటు చేసుకుని కరువును అధిగమించేందుకుగాను తలపెట్టిన రైతు అవగాహన సదస్సులను ప్రోత్సహించాలన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా కందకాలు తవ్వించేలా ప్రణాళిక తయారుచేస్తే బాగుంటుందని వివరించారు.