ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల లేమిపై సుప్రీం ఆగ్రహం

ఆరు నెలల్లో సమకూర్చాలని ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి): పాఠశాలల్లో మౌలిక వసతలు కొరతపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస వసతులు కల్పించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు బుధవారం మండిపడింది. అన్ని పాఠశాలల్లో, ప్రధానంగా బాలికలు ఉండే స్కూళ్లలో మూత్రశాలలు నిర్మించాలని ఆదేశించి ఏడాది గడిచినా.. ఎందుకు నిర్మించలేదని నిలదీసింది. స్కూళ్లలో కనీస వసతులు కల్పించడానికి ఇంకా ఎంతకాలం పడుతుందని ప్రశ్నించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆర్నెల్లలోగా మంచినీరు, మూత్రశాలలతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి ఓ స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. బడుల్లో తాగునీరు, మూత్రశాలల సౌకర్యం కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానలు ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొంది. దీన్ని విచారించిన జస్టిస్‌ కేఎస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని బెంచ్‌ నిర్దేశిత సమయంలోగా దేశంలోని అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించాలని ఆదేశించింది. న్యాయస్థానం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను కూడా అదే సమయంలోగా పూర్తి చేయాలని సూచించింది.
బడుల్లో మౌలిక వసతులపై దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై గతంలోనూ సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశాలనే వెలువరించింది. టాయిలెట్‌ సౌకర్యం కల్పించాలని, అది ప్రధాన బాధ్యత అని తెలిపింది. మూత్రశాలల సౌకర్యం లేని పాఠశాలల్లో విద్యార్థులను, ప్రధానంగా బాలికలను చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదని పలు పరిశోధనల్లో తేలిందని న్యాయస్థానం పేర్కొంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్‌ 18న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కనీస సౌకర్యాలు కల్పించక పోవడం రాజ్యాంగంలోని అర్టికల్‌ 21-ఏ ప్రకారం.. ఉచిత, నిర్బంధ విద్యా హక్కును ఉల్లంఘించినట్లేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే, ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. తాజా ఆదేశాలతోనైనా సర్కారులో కదలిక వస్తుందో? లేదో? చూడాలి.