ప్రభుత్వ విద్య బోలపేతం అందిరి బాధ్యత

బీసీ గురుకులాలు పేదలకు వరం: ఎమ్మెల్యే

యాదాద్రిభువనగిరి,జూన్‌14(జ‌నం సాక్షి): ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతగా కృషిచేయాలని ఆలేరు ఎమ్మెల్యే,విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ గురుకులాలు ఏర్పాటు చేసి వెనుకబడిన తరగతుల్లోని పిల్లల విద్యావ్యాప్తికి దోహదం చేయడం హర్షించదగిన విషయం అని అన్నారు. విద్యావ్యాప్తి ద్వారానే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. విద్యారంగం బలోపేతం కోసం టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కోట్లాది రూపాయలు బడ్జెట్‌ కేటాయిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యకు పెద్దపీట వేస్తూ ఏర్పాటు చేసిన బీసీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించారు. బడుగులకు, పేదలకు విద్యాఫలాలను అందించడంమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. వెనుకబడిన వర్గాలకు బీసీ గురుకులాలు వరంలాంటివి అని అన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థిని, విద్యార్ధులకు నాణ్యమైన విద్యతో పాటుగా పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. ఒక్కో విద్యార్థి చదువు కోసం రూ.80 వేల రూ.1లక్ష వరకు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, విద్యార్థులకు చదువులతో పాటుగా ఆటపాటలు, ప్రతి విద్యార్థికి 3జతల దుస్తులు, ట్రాక్‌సూట్‌, కంప్యూటర్‌ల్యాబ్స్‌ను ప్రభుత్వం బీసీ గురుకులాల్లో ఏర్పాటు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే విద్యార్ధులకు పౌష్టికాహారం అందించడం కోసం సన్నబియ్యంతో అన్నం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన విద్య, ఏకరూపదుస్తులు అందిస్తుందని అన్నారు. విద్యావ్యాప్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వేలాది కోట్లు ఖర్చు చేస్తుంటే ప్రతిపక్షాలు తమ ఉనికిని కోల్పోయామనే ప్రేలాపనలో ఏమి మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆయన ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ఇప్పటికే నియోజకవర్గంలో మైనార్టీ పాఠశాల, బీసీ బాలికల పాఠశాల, ఎస్టీ వసతీ గృహాల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్ధులు అభ్యసిస్తున్న ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.