ప్రభుత్వ సాయం తీసుకుంటే.. 

ఉచిత వైద్యం అందించాల్సిందే
– నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
– స్పష్టం చేసిన సుప్రిం కోర్టు
న్యూఢిల్లీ, జులై9(జ‌నం సాక్షి) : ప్రభుత్వాల నుంచి సబ్సిడీతో అంటే మార్కెట్‌ ధర కంటే తక్కవ ధరకు భూములు పొందిన ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ కచ్చితంగా బలహీన వర్గాలకు ఉచితంగా వైద్యం అందించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇదివరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సోమవారం సుప్రీం కోర్టు సమర్థించింది. ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన ప్రైవేట్‌ కంపెనీలు బలహీన వర్గాలకైనా ఉచితంగా వైద్యం అందించాలని ఢిల్లీ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ పనితీరును తాము పరిశీలిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది. ప్రైవేట్‌ ఢిల్లీ హాస్పిటల్స్‌ తమ తీర్పును కచ్చితంగా అమలు చేయాలని, వీటికి సంబంధించి… నిర్ణీత వ్యవధితో సమాచారం తమకు పంపాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
25 శాతం రిజర్వ్‌ చేయాలి..
ప్రభుత్వ భూమిపై హాస్పిటల్స్‌ కట్టిన ప్రైవేట్‌ సంస్థలు ఔట్‌ పేషెంట్స్‌లో 25 శాతం, బెడ్స్‌లో పది శాతం  బలహీన వర్గాలకు కేటాయించాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో ప్రైవేట్‌ కంపెనీలు తమ బాధ్యతను విస్మరించలేవని స్పష్టం చేసింది. పేద పేషెంట్లకు ఎలాంటి వైద్య బిల్లు వేయవద్దని ఢిల్లీ హైకోర్లు  హెచ్చరించింది. జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్ర, జస్టిస్‌ ఏకే పట్నాయక్‌లతో కూడిన బెంచ్‌ 2011లోనే  ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. దీనిపై రివ్యూ పిటీషన్‌ చేయగా… ప్రైవేట్‌  హాస్పిటల్స్‌కు సుప్రీం కోర్టు ఝలక్‌ ఇచ్చింది.