ప్రశాంతంగా ఎస్సై అభ్యర్థుల రాత పరీక్ష
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీపీ సత్యనారాయణ
కరీంనగర్ ( జనం సాక్షి ) :
ఆదివారం జరిగిన ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు రాత పరీక్ష కొనసాగింది.
ప్రిలిమ్స్ రాత పరీక్ష సందర్భాన్ని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ కాలనీలోని వాగేశ్వరి, తిమ్మాపూర్, నుస్తులాపూర్ లలోని శ్రీ చైతన్య, జ్యోతిష్మతి, ఇంజనీరింగ్ కళాశాలలు, కాశ్మీర్ గడ్డలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల, మంకమ్మ తోటలోని శ్రీ చైతన్య డిగ్రీ మరియు పీజీ కళాశాల, బైపాస్ రోడ్డు లోని వివేకానంద ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. 11,854 మంది అభ్యర్థులకు గాను 11, 192 హాజరయ్యారు. 662 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష జరిగిన కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ, అవకతవకలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా ఉదయం 9 గంటల వరకు చేరుకున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల హాజరు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పరీక్షల సందర్భంగా ట్రాఫిక్ నకు ఎలాంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు.
పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, అడిషనల్ డిసిపి లు ఎస్ శ్రీనివాస్ (ఎల్ అండ్ ఓ) జి చంద్రమోహన్ (పరిపాలన) లు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.