ప్రశాంతంగా వినాయక నిమజ్జనం
ఊపిరి పీల్చుకున్న పోలీసులు
ఆదిలాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి): ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో గణపతి నిమజ్జనోత్సవాన్ని కనుల పండువగా జరిగింది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగడంతో బోధ్ లాంటి ప్రాంతాల్లో ప్రశాంతంగా నిమజ్జనాలు సాగాయి.ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్న, జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్, పోలీసు ఉన్నతాధికారి విష్ణు ఎస్.వారియర్, పుర అధ్యక్షురాలు రంగినేని మనీష, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారి శశిధర్‌రావు, కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో పోలీసు ఉన్నతాధికారి మల్లారెడ్డి, డీఎస్పీ సాంబయ్య, తాజా మాజీ ఎమ్మెల్యే కోనప్ప, మంచిర్యాలలో డీసీపీ వేణుగోపాల్, అదనపు డీసీపీ రవికుమార్, ఏసీపీ గౌస్‌బాబా, తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావులు గణెళిశ్ ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనోత్సవ శోభాయాత్రలో పాల్గొన్నారు. నవరాత్రుల్లో విశేష పూజలందుకున్న వినాయకుడు ఇక సెలవంటూ గంగమ్మ ఒడికి చేరాడు. విఘ్నాలు తొలగించి శుభాలు చేకూర్చే గణనాథుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై వినాయక విగ్రహాలను కొలువుదీర్చి శోభాయాత్ర నిర్వహించారు. డప్పుచప్పుళ్లు, మంగళవాయిద్యాలు, కళాకారుల నృత్యాలు, మహిళల కోలాటలు, యువత ఆనంద నృత్యాలు, కేరింతల నడుమ నిమజ్జనోత్సవ
యాత్ర శోభాయమానంగా సాగింది. నదులు, చెరువులు, నీటి వనరుల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు.