ప్రాచీనత సరే, ఆధునిక హోదా ఎప్పడు?

తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందన్న వార్త ఒకందకు సంతోషకరం. తెలుగు భాషకు ఏదో అన్యాయం జరిగిపోయిందన్న చర్చ నుంచి విముక్తలమయ్యాము. ప్రాశస్త్యం గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండగలవుగానీ ప్రాచీనత వస్తుగతమైన విషయం. క్లాసికల్‌ అనే పదాన్ని ప్రాచీనం అనే అర్థంలో తీసుకునేట్టయితే తమిళం ప్రాచీనతను రుజువు చేయడానికి కుండ పెంకులూ, శిలా ఫలకాలు వెతకనక్కరలేదు. తమిళుల సంస్కృతిలో ఇప్పటికీ సజీవంగా ఉన్న రెండు వేల ఏళ్లనాటి సాహిత్యం ఉంది. కాబట్టి తమిళం ప్రాచీనతకు ముందు గుర్తింపు వచ్చి తెలుగు ప్రాచీనతకు ఆలస్యంగా రావడంలో ఆశ్చర్యపోవలసిందేమి లేదు. అందులో కుట్రల కోసం వెతకవలసిన పనీ లేదు. ఆలస్యంగానైనా మనవాళ్లు నిజంగా ఏమైనా ఆధారాలు చూపించగలిగారా లేక కాంగ్రెస్‌ వారికి అతి ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి కావడం, చాలా ఆశలు పెట్టుకున్న ముఖ్యమంత్రుల్లో రాజశేఖరెడ్డి ఒకరు కావడం ఈ గుర్తింపుకు కారణమా అని అనుమానం రాక మానదు. దీని కెవ్వరూ కోపగించుకోవలసిన పని లేదు. నోబెల్‌ పురస్కారాలనే ఈ మధ్య ఈ రకమైన కారణాలు నిర్ణయిస్తున్నాయి.కాగా తమిళుల భాషాభిమానం మన లాగ అలంకార ప్రాయమైన గుర్తింపులు దగ్గర ఆగిపోలేదు. ప్రజల నిత్యజీవితానికి సంబంధించిన పాలానా వ్యవహారాల్లో పారదర్శకతకు స్వభాష అనేది ఒక సాధనం ఆ హోదా తమిళానికి కల్పించడానికి వారు చూపే శ్రద్దలో పదవ వంతు కూడా మనం చూడలేదు. రాష్ట్రంలో తెలుగు అధికార భాష అని చెప్పే చట్టం 1996లో చేసుకున్నాం. (ఉర్ధూ హైదరాబాద్‌ బాద్‌, అనంత పురం, కర్నూలు, కడప గుంటూరు, మెదక్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, జిల్లాలో రెండవ అధికార భాష అన్న సవరణ 1996 లోజారీ అయింది.) ప్రభుత్వం జారీ చేసే చట్టాలూ ఆదేశాలూ నియమాలు, ప్రభుత్వం ఇతర సంస్థలతో జరిపే ఉత్తరప్రత్తుత్తరాలూ అధికార భాషల్లోనే ఉండాలని, అయితే అది ఎప్పటి నుంచి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆ చట్టంలో రాసుకున్నాం.
ఆ తరువాత 22 సంవత్సరాలు ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. 1998లో జీ.వో నెంబర్‌ 587 జారీ చేసి, ఆ సంవత్సరం నవంబర్‌ 1 నుంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ ఉత్తర ప్రత్యుత్తరాలూ ఇక మీదట తెలుగులోనే ఉంటాయనీ ఇంగ్లీస్‌ కేవలం కేంద్ర ప్రభుత్వంతో, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే భాషగా ఉంటుందనీ అనింది. ఉర్దూకు 1996లో రెండవ అధికార భాష హోదా లభించిన తరువాత ఉర్దూ కూడా ఆ మేరకు తెలుగు సరసన చేరింది. ఈ ఆదేశం జారీ చేసి మొన్నటికీ 20 ఏళ్లు గడిచాయి. సకల ప్రభుత్వ వ్యవహారాల సంగతి దేవుడెరుగు, ప్రజలను సంప్రదించాలి అని చట్టం చెప్పే పాలనా ప్రక్రియలకు సంబంధించినా ఆదేశాలు, నివేదికలు సహితం గుర్తింపు పొందిన అధికార భాషల్లో వెలువడటం లేదు.నగరాల ప్రణాళికలు( మాస్టర్‌ ప్లాన్‌లు) లక్షలాది ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఎక్కడ ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు, ఏ భూభాగం దేనికి కేటాయించిబడింది. ఇత్యాది విషయాలు నగర ప్రణాళికల్లో ఆదేశాల రూపంలో ఉంటాయి. ఈ మధ్య కాలంలో నగరాల ప్రణాళికలు నగరం పరిధిని దాటి చాలా దూరం పోతున్నాయి. కొత్తగా ప్రతిపాదించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర ప్రణాళిక నగరం చుట్టూ ఉన్న 896 గ్రామాలకు కూడా వర్తిస్తుంది. విశాఖపట్నం నగర ప్రణాళికల్లో ఆజిల్లాలోని కొండ ప్రాంతాలు తప్ప అన్నీ ఉన్నాయి. ఈ కారణంగా ఆ ప్రణాళిక ముసాయిదాను ప్రజలకు  అందుబాటులో ఉంచి వారి అభిప్రాయాలూ అభ్యంతరాలూ ఆహ్వానించి వాటిని పరిశీలించిన తరువాతే తుది రూపం ఇవ్వడం అవసరం.ఇవ్వాలని చట్టం కూడా అంటోంది. కానీ ఎన్ని సార్లు ఆందోళన చేసినా ఆ ముసాయిదాను తెలుగు, ఉర్దూ భాషల్లో ఇవ్వడం లేదు. ఇంగ్లీష్‌లోనే తయారు చేస్తారు. గొడవ చేయగా చేయగా ఎందుకూ కొరగాని సంక్షిప్త అనువాదం మాత్రం కొంతకాలంగా ఇస్తున్నారు. అసలే ఈ మధ్య ప్రభుత్వ పత్రాల్లో సాదాసీదా ఇంగ్లీష్‌ బదులు వంకర ఇంగ్లీష్‌ వాడడం నేర్చుకున్నారు. రోడ్లు అనడానికి కనెక్టివిటీ అంటారు. పచ్చగా ఉందనడానికి ఈకో ఫ్రెండ్లీ అంటారు. మొత్తం అనువాదం చేసినా కూడా అర్థం చేసుకోవడం కష్టం ప్రజలకు సంక్షిప్త అనువాదాలే అందుబాటులో ఉండడం వల్ల నగర ప్రణాళికల ప్రజాభిప్రాయం ప్రాయ సేకరణ రియల్‌ ఏస్టేట్‌ డీలర్లకు మాత్రమే అక్కర కొస్తున్నది.  ఫ్యాక్టరీలకూ ప్రాజెక్టులకు సంబందించిన ప్రజాభిప్రాయ సేకరణలకూ ఇదే గతి పట్టిస్తున్నారు. అసలే పర్యావరణ నివేదికల్లో మాయ మర్మం ఎక్కువ ఉంటుంది. దానిని తయారు చేసేది ప్రభుత్వం కాదు, ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి కాదు, నిష్ఫాక్షికంగా పరిశీలించగల నిపుణులూ కాదు. ఆ ఫ్యాక్టరీ యజమానే కిరాయికి నివేదికిలు తయారు చేసే వృత్తి నిపుణులతో తయారు చేయిస్తాడు. వారు పూర్తిగా అబద్దాలూ రాయలేరు. నిజాలు రాసి గిరాకి పోగేట్టుకోనూలేరు. చెప్పే విషయాల కంటే దాచి పెట్టే విషయాలు ఎక్కువగా ఉండే నివేదికలు తయారు చేస్తారు. మొత్తం చదవగలిగినా ఒకటికి నాలుగు సార్లు చదివి ఎరినైనా నిపుణులను సంప్రదింస్తే తప్ప అసలు సంగతి అర్థం కాదు. ఈ నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, వారి అభిప్రాయాలు అభ్యంతరాలు వినడానికి బహిరంగ విచారణ జరపాలని చట్టం అంటుంది. కానీ ఈ నివేదిక ప్రజలకర్తమయ్యే భాషల్లో అందచేయాలనీ, వారికి వివరించి చెప్పాలనీ ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ పని మాత్రం చేయరు. అందువల్ల ప్రజలెవ్వరూ పర్యావరణ సంబంధమైన చర్చలో పాల్గొనలేకపోతున్నారు. అలాగే న్యాయస్థానాల్లో స్థానిక భాష వాడకపోవడం. ఇది చాలా ఘోరమైన విషయం అని అందరూ గుర్తిస్తున్నారు. తమ జీవితాలు, ఆస్తులు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వ్యాజ్యాల్లో విచారణ, వాదోపవాదాలు తమకు అర్థం కాని భాషలో జరుగుతుంటే నోరు వెళ్ల బెట్టుకుని చూసే స్థితిలో సగటు పౌరులుండడం అవమానకరం. తమిళులు 1976 నుంచి క్రిమినల్‌ నేర విచారణ వ్యవస్థ (సెషన్స్‌ కోర్టు దాకా కూడా) మొత్తం తమిళంలోనే నడుపుతున్నారు. 1982 నుంచి సివిల్‌ వ్యాజ్యాల విచారణ యావత్తు తమిళంలోనే నడుపుతున్నారు. ఉత్తర భారత దేశంలోని హిందీ రాష్ట్రాలు హిందిలోనూ గుజరాత్‌, బెంగాల్‌ వంటి రాష్ట్రాలు తమ తమ భాషల్లోనూ న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి. (రాష్ట్ర హైకోర్టును మినహాయించి) మెజిస్ట్రేట్‌ కోర్టుల్లో సహితం ఇంగ్లీష్‌ను పట్టుకు వేళ్లాడునతున్న అతికొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి.రాజీవ్‌ గాంధీ హత్య దేశ రాజకీయాలను కుదిపివేసిన విషయం కావచ్చు గానీ అది జరిగింది. తమిళనాడులో కనుక ఆ నేర విచారణ మొత్తం తమిళంలోనే జరిగింది. అది టాడా కేసు కాబట్టి అప్పీలు సుప్రీం కోర్టుకు పోయింది. కట్టలు  కట్టలు తమిళంలో ఉన్న పత్రాలు చూసి సుప్రీం కోర్టు రిజిస్ట్రీ అవాక్కయిందంటారు. అన్నిటిన ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయించుకొని అప్పీలు విన్నారు.భోధనా మాధ్యమం గురించి ముచ్చటించుకుని ముగిద్దాం. ఇది తెలుగుకే కాదు అన్ని భారతీయ భాషలకూ కొద్ది తేడాలతో వరిస్తుంది. విద్య ప్రైవేటికరణ కారణంగా రెండు విద్యా వ్యవస్థలు దేశంలో ఏర్పడ్డయనేది అందరూ గుర్తిస్తున్న సత్యం. ఏ కొంచెం డబ్బున్న వారి పిల్లలైన ఆంగ్ల మాధ్యమంలో ప్రైవేటు బడుల్లో చదువుకుంటున్నారు. ఏమీ లేని పిల్లలు ప్రధానంగా దళిత, ఆదివాసీ ప్రజానీకానికి, బాగా వెనుకబడిన ప్రాంతాలకూ చెందిన వారు ప్రభుత్వ పాఠశాలల్లో స్థానిక భాషా మాధ్యమంలో చదువుకుంటున్నారు. పాలనా వ్యవస్థలోనూ అంతకంటే ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థల్లోనూ ఇంగ్లీష్‌ వచ్చిన వారికే మంచి హోదా పొందే అవకాశం ఉండడం వల్ల రెండవ వర్గానికి చెందిన పిల్లలు చిన్నతనం నుండే అవకాశాలు కోల్పోతున్నారు. దీనికి ప్రభుత్వాలకు కనిపించిన విరుగుడు ప్రభుత్వ పాఠశాల్లో కూడా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం. అధ్యాపకులకు ఇంగ్లీష్‌ రానప్పుడు ఇది వారిపైనా పిల్లలపైనా పెనుభారం వేస్తుందని అధ్యాపక సంఘాలు అభ్యంతరం చెప్పగా ఎంత కష్టమైనా సమాన అవకాశాలు దక్కాలంటే ఈ మార్పు తప్పదనీ, పిల్లలు కొత్త భాషలు సునాయాసంగా నేర్చుకోగలరనీ ప్రభుత్వమూ, దళిత సంఘాలూ అన్నాయి. మాతృభాషలో విద్యా బోధనే పిల్లలకు మంచిదన్న సూక్తి సహజంగానే హేళనకు గురైంది. ఆ సూక్తి దళితులకే ఎందుకు చెప్తారు అన్న ప్రశ్నకు ఎవరి దగ్గరా జవాబు లేదు. ఆ సూక్తి ప్రవచించే వాళ్ల పిల్లలు ఏ మాధ్యమంలో చదువుకుంటున్నారన్న ప్రశ్నకూ అసలే జవాబు లేదు. ఇంతవరకు నిజమే గానీ పిల్లలందరినీ ఆంగ్ల మాధ్యమంలో పడేడయడం అసమాన అవకాశాలకు సమాధానం కాదు. పిల్లలకు భాషలు సులభంగా నేర్చుకుంటారనేది వాస్తమే గానీ భాష నేర్చుకోవడం వేరు, భాషలో చదువు నేర్చుకోవడం వేరు. భాష నేర్చుకునేటప్పుడు మన జీవిత అనుభవాలనూ అనుభూతులనూ వ్యక్తం చేయడం నేర్చుకుంటాం. చదువు నేర్చుకునేటపుడు మన జీవిత అనుభవానికి చాలా దూరమున్న విషయాల వ్యక్తీకరణ నేర్చుకోవాలి. ఇవి వేరు వేరు విషయాలు. ఎంత తెలివైన పిల్లలైనా ఇంగ్లీష్‌తో పరిచయం లేని వారికి ఆంగ్ల మాద్యమంలో చదువు చెప్పే ప్రయత్నం చేసిన వారందరికీ అదెంత హింసో తెలుసు.సమాన అవకాశాలకు నిజమైన మార్గం బీద పిల్లలందరినీ ఇంగ్లీష్‌ మీడియంలోకి నెట్టడం కాదు. అన్ని వర్గాల పిల్లలూ స్థానిక భాషా మాధ్యమంలోనే చదవు కోవాలన్న నియమాన్ని తప్పనిసరి చేయడం. ప్రైవేటు పాఠశాలలకు సహితం ఈ నియమాన్ని వర్తింప చేయాలి. దీనికి రాజ్యాంగాన్ని సవరించడం అవసరమైతే ఆ పనీ చేయాలి. కనీసం డిగ్రీ స్థాయి దాకా ఈ నియమాన్ని పెట్టి ఇంగ్లీష్‌ను కేవలం ఒక భాషగా అందరీకి చిన్నప్పటి నుంచి ఒకే సిలబస్‌ పెట్టి నేర్పాలి. దీని వల్ల పిల్లలు ఆధునిక జ్ఞానాన్ని కోల్పోతారన్న భయం  ఉండనక్కర్లేదు. ఆధునిక వైజ్ఞానిక ప్రపంచంలో భారతీయులది పెద్ద సంఖ్య అని గొప్పగా చెప్పుకుంటుంటాం. ఈ మేధావుల్లో వసలపోయిన వారిని మినహాయిస్తే తక్కిన వారంతా దండిగా జీతాలు తీసుకుంటూ యూనివర్సిటిల్లోనూ పరిశోధనా కేంద్రాల్లోనూ ఏ పనీ లేకుండా ఉన్నారు. వారి జ్ఞానాన్ని ఆయా ప్రాంతాల భాషల్లోకి తీసుకొచ్చే పుస్తకాలు రాసే పని వారికి అప్పగించవచ్చు.నిజానికి ఈపని పట్టు దలగా చేస్తే డిగ్రీ దాకానే ఎందుకు, విద్యా వైజ్ఞానిక వ్యవస్థ మొత్తం మన భాషల్లోనే ఉండగలదు. మనం తెలుగును పోలిన లిపిలో కుండపెంకులు మీద బండరాళ్ల మీద రాసుకుంటున్న రోజుల్లో చెప్పుకోవాడానికి ఒక లిపి సమితం లేని రష్యా వాళ్లు, జపాన్‌ వాళ్లు (చైనీయులను పోనీయండి వారిది తమిళం కంటే కూడా పాత భాషా) చేయగలిగిన పనిని మనమెందుకు చేయలేం? ఒకజాతి ఎదుగుదలకు కావలసింది వారి భాష ప్రాచీనత కాదు, ఆధనీకత అని మొదట గుర్తిస్తే ఏదీ అసాధ్యం కాదు.
 కె. బాలగోపాల్‌

తాజావార్తలు