ప్రాచీన ఆలయాలకు..  పూర్వవైభవం తెస్తాం

– పోట్లపల్లి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
– బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలి
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు
– పోట్లపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన హరీష్‌రావు
సిద్దిపేట, మార్చి4(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలోని పురాతన, ప్రాచీన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, వాటికి పూర్వవైభవం తెస్తామని మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గం పోట్లపల్లి గ్రామంలో వెలసియున్న శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయంలో హరీష్‌రావు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌, రాష్ట్ర టూరిజం చైర్మన్‌ భూపతిరెడ్డిలతో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా హరీస్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. గొప్ప మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయమని, కాకతీయుల చరిత్రకు అనవాళ్లను నిలయం మన పోట్లపల్లి రాజన్న ఆలయం నిలుస్తుందన్నారు. స్వయంభూగా వెలసిన ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగిన స్వామి మన పోట్లపల్లి రాజేశ్వర స్వామి అన్నారు. సీఎం కేసీఆర్‌ పురాతన,  ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు. వేములవాడ రాజన్న తర్వాత మన పోట్లపల్లి రాజన్ననే ప్రసిద్ధి క్షేత్రమని హరీష్‌రావు అన్నారు. అటు వేములవాడ.. ఇటు కొత్త కొండ వీర భద్ర స్వామి మధ్యలో మన పోట్లపల్లి రాజన్న ఆలయం ఉందన్నారు. స్వామి ఆశీస్సులతో ప్రభుత్వం చేసే అన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలని, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాకారం కావాలని హరీష్‌రావు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో పోట్లపల్లి దేవాలయాన్ని ఒక పర్యాటక  కేంద్రంగా తీర్చిదిద్దుతామని హరీష్‌రావు పేర్కొన్నారు. కోటి రూపాయలతో  దేవాలయ ముందు ఉన్న వాగు చెక్‌ డ్యామ్‌ నిర్మిస్తున్నామని, పనులు వేగవంతంగా జరిగేవిదంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోట్లపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాని, ఈ పర్వదినాన వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు  ఏర్పాటు చేసిన ఆలయ నిర్వహణకు, గ్రామ పంచాయతీకి ,అధికారులకు అభినందనలు తెలిపారు.

తాజావార్తలు