ప్రాజెక్టులను అడ్డుకుంటే పుట్టుగతులు ఉండవ్‌

వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు గుణపాఠం తప్పదు :చారి

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ప్రాజెక్టులను అడ్డుకుంటే చరిత్రహీనులుకాక తప్పదని కాంగ్రెస్‌ టిడిపిలను ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలాచారి హెచ్చరించారు. ప్రభుత్వం కోటి ఎకరాలకు సాగు నీరు లక్ష్యంగా ప్రాజెక్టుల రీడిజన్‌ చేసి నిర్మిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీలు జల రాజకీయం చేస్తున్నాయని ఆక్షేపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు పూర్తి చేసి వారి కళ్లు తెరిపిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యంగా ప్రాజెక్టులు కడుతున్నట్లు చెప్పారు. దీన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పొతున్నాయన్నారు. మరో 20 ఏళ్ల పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచి అధికారంలో ఉండి రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని కొనియాడారు. బిజెపి పాలకులు కొత్త ఒరవడిని సృష్టిస్తారని అనుకుంటే కాంగ్రెస్‌ మూసలోనే నడుస్తున్నారని అన్నారు. నిధుల విడుదల, సమస్యల పరిష్కారం వంటివి నీతి ఆయోగ్‌ ఏర్పాటుచేసిన సందర్భంలో చెప్పిన మాటలు విస్మరించి మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందన్నారు. టిడిపి నేతలు జలరాజకీయాలు మానుకోవాలని అన్నారు. ప్రతి ఎకరాకు సాగునీటిని అందించి రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం అందజేస్తామని ఎవరూ అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. ఐక్యతతో మనమందరం జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.