ప్రాజెక్టులను అడ్డుకోవడం తగదు: ఎమ్మెల్యే
మెదక్,ఆగస్ట్16(జనం సాక్షి): ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలవుతుందని కాంగ్రెస్ గుర్తించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పదేళ్ల కాలంలో చేయలేని పనులను సిఎం కెసిఆర్ నాలుగేళ్ల కాలంలోనే చేసి చూపారని అన్నారు. ఇది జీర్ణించుకోలేక విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ ప్రాజెక్టులతోనే సాధ్యమవుతుందన్న దృష్టితో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తుంటే కాంగ్రెస్ కోర్టుల ద్వారా ప్రాజెక్టులను అడ్డుకుంటుందని, అన్నారు. ఇకనైనా అలాంటి పనులు మానుకోవాలని ఆయన హితవు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ బంగారు తెలంగాణగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టులకు పునర్జీవనం పోస్తున్నారని పేర్కొన్నారు. ఏదేమైనా ప్రాజెక్టులకు ఎవరు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు. రైతన్నలకు పంట పెట్టుబడుల కోసం ఎకరాకు రూ.4వేలు ఇస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గతంలో కట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపానాపోలేదని పేర్కొన్నారు. శ్రీరాంసాగర్ వరద కాలువలతో పాటు పంట కాలువల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. మల్లన్నసాగర్ పూర్తయితే నాలుగు జిల్లాలకు తాగునీరందుతుందని వెల్లడించారు. తెలంగాణలోని 31 జిల్లాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని అన్నారు.



