ప్రాజెక్టులు పూర్తయితే గోస తీరుతుంది: బండారి
మహబూబ్‌నగర్,జూలై2(జనం సాక్షి):ఎన్నో యేళ్లుగా నడిగడ్డ ప్రాంతంలో చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందక రైతులు వలసలు పోయారని జడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. జిల్లాలో చేపట్టిన నీటి ప్రాజెక్ట్ పథకాల అమలుతో ఇక్కడి పొలాలన్నీ పచ్చబడతాయన్నారు. వీటిని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ నేతలు విమర్శలకు పూనుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలకిచ్చిన హావిూ మేరకు చివరి ఆయకట్టు భూములను శశ్యశామలం చేసేందుకు సుమారు రూ.786 కోట్ల నిధులతో తుమ్మిళ్ల, రూ.550 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకాలు చేపట్టారన్నారు. తుమ్మిళ్ల, గట్టు లిఫ్టులు నడిగడ్డ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అని అన్నారు. ఈ పథకాల అమలు గట్టు ప్రజల చిరకాలవాంచ అని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో కేవలం ఇక మిగిలింది పదవుల, టికెట్ల కోసం ఆశించే వారేనని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ఇప్పటికే చతికిల పడిందన్నారు. తమ ఉనికి కాపాడుకోవడానికి కొంత మంది నాయకులు నానాయాతన పడుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించే స్థితిలో లేరన్నది వాస్తవమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, పంటలకు గిట్టుబాటు ధర, పండించిన పంటలను నిల్వ ఉంచుకోవడానికి గిడ్డంగులు, పంటలు పండించ డానికి పెట్టుబడి సాయం, రైతులకు రైతు బీమా వంటి ఎన్నో లెక్కలేనన్ని పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని అన్నారు.