‘ప్రాణహిత’కు జాతీయ హోదా కల్పించాలి
ఆదిలాబాద్, ఆగస్టు 2 : ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ద్వారా తెలంగాణ జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సీపీఐ శాసనసభ పక్ష నేత జి. మల్లేష్ అన్నారు. కేంద్రం తక్షణమే ఈప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్టీ అనుబంధ సంఘమైన రైతు సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన రైతు పోరుబాట కార్యక్రమాన్ని ప్రాణహిత జన్మస్థలమైన కౌటాల మండలం తుమిడి హెడ్డి గ్రామం వద్ద గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వల్ల గుత్తెదారులు కోట్లలోలబ్ధిపొందుతుండగా, రైతులకు మాత్రం ఎలాంటిప్రయోజం లేదని అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్థాపన చేసినప్పటికీ నిధుల మంజూరులో వివక్షత చూపడం వల్ల నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదనిఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు తెలంగాణ రైతుల గుండె కోతను గుర్తించి జాతీయ హోదాను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రభుత్వం కళ్లు తెరిచేందుకు ఈ రైతు పోరుబాట చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు అరుణ్‌కుమార్, శంకర్ తదితరలు పాల్గొన్నారు.