ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరగా జాతీయ హోదా ఇవ్వండి

dkfztxumప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. లోక్ సభలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో అడ్డంకులున్నాయని, ప్రాణహిత-చేవెళ్లకు ఎటువంటి అడ్డంకులు లేవని సుమన్ గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలసంఘం ముందున్న ఫైళ్లకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని ఆయన కోరారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ ఏడు జిల్లాల్లోని 16 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని టిఆర్ఎస్ ఎంపీ వివరించారు. 180 టీఎంసీల నీరు వినియోగంలోకి వచ్చి వ్యవసాయ రంగం బలోపేతమవుతుందని చెప్పారు. సాగునీటి కొరత వల్ల తెలంగాణలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక తెలంగాణ యువకులు గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే ముఖ్యమైన గోదావరి, కృష్ణా నదుల నీటిని ఉపయోగించుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో సరైన చర్యలు తీసుకోలేదని సుమన్ గుర్తుచేశారు.