ప్రియాంక అవసరమేమీ లేదు: వాద్రా

3న్యూఢిల్లీ: తనపై జరిగే రాజకీయ దాడులను ఎదుర్కొనే సమర్థత తనకు ఉందని, తనకు సంబంధించిన అంశాల్లో భార్య ప్రియాంకగాంధీ సహాయం తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా పేర్కొన్నారు.

‘నా జీవితాన్ని ఉద్ధరించడానికి ప్రియాంక అవసరం నాకు లేదు. నాకు చాలినంత ఉంది. నా తండ్రి నాకు కావాల్సినంత ఇచ్చాడు. అన్ని రకాల పరిస్థితులను తట్టుకొని నిలబడగల చదువు నాకుంది’ అని వాద్రా ఏఎన్‌ఐ వార్తాసంస్థతో పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. తనకు ఇంకా భవిష్యత్తు ఉన్నందున సరైన సమయం వచ్చేవరకు వేచిచూస్తానని చెప్పారు. రాజస్థాన్, హర్యానాలో రాబర్ట్ వాద్రా కంపెనీలు అక్రమ భూ కొనుగోళ్లకు పాల్పడినట్టు బీజేపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాద్రా భూ కొనుగోళ్ల వ్యవహారంపై పలు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో తనకు దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లే ఆలోచన లేదని వాద్రా స్పష్టం చేశారు.

‘నేను ఇక్కడే పుట్టిపెరిగాను. నాకు అవమానాలు ఎదురైనా నా దేశాన్ని విడిచివెళ్లను. ప్రభుత్వం ఏమైనా చెప్పని.. వాటన్నింటిని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం నాకుంది. నాకున్న బలమైన కుటుంబ అనుబంధం ఈ సామర్థ్యాన్ని నాకిచ్చింది’ అని వాద్రా చెప్పారు.