ప్రియుడు ముఖం చాటేశాడని.

సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి
– తనకు న్యాయం చేయాలని బాధితురాలి డిమాండ్‌
భువనగిరి, జులై13(జ‌నం సాక్షి) : ప్రేమించినప్పుడు తనతో సరదాగానే ఉన్నాడు.. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి కథ అడ్డం తిరిగింది. మాటిచ్చిన ప్రియుడు ఆమెకు ముఖం చాటేస్తున్నాడంటూ తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి నగరంలోని స్థానిక వెంకటేశ్వర థియేటర్‌ పక్కన ఉన్న సెల్‌ టవర్‌ స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి, వలిగొండ మండల కేంద్రానికి చెందిన రావుల భాస్కర్‌ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ అన్నప్పుడు తనతో సరదాగా సమయం గడిపిన ప్రియుడు పెళ్లి మాట ఎత్తేసరికి దూరంగా ఉంటున్నాడని ఆ యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని భాస్కర్‌ను గట్టిగా నిలదీయడంతో అందుకు అతడు నిరాకరించాడని, పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని యువతి వాపోయింది. ఇంకో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఆరోపిస్తూ.. ప్రియుడి ఇంటి ముందు గత మూడు రోజులుగా బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నా న్యాయం జరగడం లేదని మనస్తాపానికి లోనయ్యానని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్‌ చేశారు. కాగా అధికారులు, స్థానికులు అక్కడికి చేరుకొని యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.  మరోవైపు జ్యోతికి మద్దతుగా ప్రజాసంఘాల నేతలు రోడ్డుపై బఠాయించి, జ్యోతికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.