ప్రేమ జంట గ్రామ బహిష్కరణ
– తక్కువ కులం వాన్ని పెండ్లి చేసుకుందని కుటుంబం వెలివేత
– మూడేండ్లు గడిచినా శాంతించని కులపెద్దలు
– బిక్కుబిక్కుమంటూ పట్టణంలో మకాం
– వికారాబాద్ జిల్లా సిద్ధులూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
వికారాబాద్రూరల్
తక్కువ కులం వాడిని పెండ్లి చేసుకుందని కులపెద్దలు కుటుంబంతో పాటు ప్రేమజంటనూ శాశ్వతంగా గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తోంది. ఈ విషయం మూడేండ్ల తరువాత వికారాబాద్ జిల్లా సిద్దులూర్లో స్థానిక అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి చొరవతో శనివారం వెలుగులోకి వచ్చింది. సిద్దులూరు గ్రామానికి చెందిన బంటు అంజయ్య- అనసూజ కుమార్తె సువర్ణ (ముదిరాజ్ సామాజిక తరగతి), కొటాలగూడకు చెందిన వినరు(ఎస్టీ) మూడేండ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వినరు
కుటుంబం వారిని ఇంటికి రానివ్వలేదు. ఇటు సిద్దులూరులో గ్రామపెద్దలూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అంజయ్య కుమార్తె తక్కువ కులం వాడిని పెండ్లి చేసుకుందని ఆ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు. అంజయ్య కుటుంబాన్ని గ్రామంలో మంచి చెడులకు ఎవరూ పిలవడం లేదు. ఇరుగు పొరుగు వారు కూడా వారితో మాట్లాడటం లేదు. దీంతో అంజయ్య కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురవుతోంది. ప్రాణ భయంతో సువర్ణ-వినరు దంపతులు హైదరాబాద్ చేరుకున్నారు. ఒకటి రెండుసార్లు గ్రామానికి వచ్చి అందరితో కలిసిపోయే ప్రయత్నం చేయగా, మీ కుటుంబ సభ్యులను కులం నుంచి బహిష్కరించామనీ, ఇతర కుటుంబాలతో కలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ గ్రామ పెద్దలు హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం ఆ దంపతులు హైదరాబాద్లో కూలీ పని చేసుకొని జీవిస్తున్నారు. మూడేండ్ల నుంచి వారు గ్రామం ముఖం చూడలేదు. వారికి ప్రస్తుతం ఒక కుమార్తె. ప్రభుత్వం, అధికారులు జోక్యం చేసుకొని కులాంతర వివాహం చేసుకున్న తమకు ప్రభుత్వ ప్రోత్సాహం అందించి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. అలాగే, గ్రామపెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చి తమ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ నుంచి కాపాడాలని వేడుకున్నారు.