ప్రైవేటు బిల్లు ద్రవ్యబిల్లే: జైట్లీ


దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ప్రైవేటు బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? అన్న అంశం ప్రభుత్వం, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చకు దారి తీసింది. ప్రైవేటు బిల్లు.. ద్రవ్య బిల్లేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తేల్చి చెప్పగా.. ఆయన ప్రకటనపై కాంగ్రెస్‌ సభ్యులు కేవీపీ, జైరాం రమేశ్‌, కపిల్‌ సిబల్‌ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని జైట్లీ రాజ్యసభను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది.

 ప్రైవేటు బిల్లు సభ్యుడి హక్కు: కేవీపీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని భాజపా కావాలనే వివాదం చేస్తోందని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. ప్రత్యేకహోదాపై తాను ప్రవేశపెట్టిన రాజ్యసభలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రైవేటు బిల్లును ఆర్థిక బిల్లు అంటూ తిరస్కరించడం ప్రభుత్వానికి సరికాదని కేవీపీ అన్నారు. ప్రైవేటు బిల్లు అనేది ప్రతి సభ్యుడి హక్కని.. దానిని తిరస్కరించడమంటే సభ్యుడి హక్కును కాలరాయడమేనని అన్నారు.
 నేనిచ్చిన హామీలు నెరవేర్చండి: మన్మోహన్‌సింగ్‌
తాను ప్రధానిగా ఉన్నప్పుడు ఏపీకి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. అప్పుడు తాను ఇచ్చిన ఆరు హామీలపై అరుణ్‌జైట్లీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు మన్మోహన్‌ తెలిపారు. తాను ఇచ్చిన హామీలపై 2014, మార్చి 1న అప్పటి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. ఆ ముసాయిదా ప్రతిని రాష్ట్రపతికి పంపగా ఎన్నికల షెడ్యూల్‌ ఉన్నందున ఆగిపోయిందన్నారు. తాను ప్రధాని హోదాలో ఇచ్చిన హామీలను ఇప్పటి ప్రభుత్వం నెరవేర్చి సభా గౌరవాన్ని కాపాడాలని మన్మోహన్‌ కోరారు.
 ద్రవ్యబిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌ పెట్టలేం: జైట్లీ
ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. ఆయన ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలనే తాము చూస్తున్నామన్నారు. ఏపీకి అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ రాష్ట్ర ఎంపీలతో పలు అంశాలపై చర్చించినట్లు జైట్లీ తెలిపారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఆర్థిక బిల్లు అని లోక్‌సభ కార్యదర్శి స్పష్టం చేసినట్లు జైట్లీ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం ద్రవ్య బిల్లుకు రాజ్యసభలో ఓటింగ్‌ నిర్వహించే సంప్రదాయం లేదని.. అందువల్ల ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతామని జైట్లీ స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 100 ద్రవ్య బిల్లు గురించి స్పష్టంగా చెబుతోందన్నారు. కొన్ని అంశాలపై రాజ్యసభలో నేరుగా చట్టం చేయలేయని జైట్లీ తెలిపారు. ఒక ప్రభుత్వం లోక్‌సభలో మైనార్టీలో ఉండి కొనసాగలేదని.. అదే రాజ్యసభలో మైనార్టీలో ఉన్నా కొనసాగగలదని జైట్లీ అన్నారు. లోక్‌సభ, రాజ్యసభకు అధికారాల్లో స్పష్టమైన తేడా ఉందన్నారు.
 జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: జైరాం
ప్రైవేటు బిల్లుపై అరుణ్‌జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్‌ ఆరోపించారు. రాష్ట్రపతి ఆమోదంతోనే కేవీపీ ప్రైవేటు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారని.. అప్పుడు ఇది ద్రవ్యబిల్లా? కాదా? అన్నది ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. అప్పుడు సభా సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? లేదా? అన్నదానిపై జైట్లీ స్పష్టత ఇవ్వాలని కోరారు.
 జైట్లీతో ఏకీభవించను: కపిల్‌ సిబల్‌
ప్రత్యేక హోదా కోరుతూ కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు ద్యవ్యబిల్లు అని జైట్లీ చేసిన ప్రకటనపై తాను ఏకీభవించనని కాంగ్రెస్‌ సభ్యుడు కపిల్‌ సిబల్‌ అన్నారు. ప్రతి బిల్లు సంఘటిత నిధికి సంబంధించినదేనని.. జైట్లీ వివరణ ప్రకారమైతే ప్రతి బిల్లూ ద్రవ్యబిల్లే అవుతుందన్నారు. ప్రైవేటు బిల్లులో నేరుగా నిధుల ప్రస్తావన ఎక్కడా లేదని సిబల్‌ పేర్కొన్నారు.
 లోక్‌సభ స్పీకర్‌కు నివేదిస్తాం: కురియన్‌
కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు… ద్రవ్య బిల్లా? కాదా? అన్న అంశంపై చర్చ ముగిసినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై లోక్‌సభ స్పీకర్‌కు నివేదిస్తామన్నారు. ఈ బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? అన్న దానిపై రాజ్యసభ ఛైర్మన్‌ నిర్ణయం తీసుకోలేరని కురియన్‌ స్పష్టం చేశారు.