ప్రైవేట్ పాఠశాలల్లోనూ శిక్షణ ఉపాధ్యాయుల ఎంపిక
టెట్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం
హైదరాబాద్,ఫిబ్రవరి15(జనంసాక్షి): జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడితే టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలన్నా టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే. చాలా ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే శిక్షణ పొదంఇన వారిని మాత్రమే టీచర్లుగా తీసుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ప్రతి ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది టెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే 2011లో నిర్వహించిన మొదటి టెట్ వ్యాలిడిటీ గతేడాదితో ముగిసిపోయింది. 2012 జనవరిలో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ కూడా గత నెలతోనే ముగిసిపోయిం ది. ఇక 2012 జూన్‌లో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ వచ్చే జూలై నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం వస్తుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం కనుక అనుమతిస్తే వార్షిక పరీక్షల తరువాత వచ్చే మే నెలలో టెట్‌ను నిర్వహించే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన 2011 టెట్, 2012 జనవరి, జూన్‌లలో నిర్వహించిన టెట్‌లకు దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో సగం మంది ఆంధప్రదేశ్ విద్యార్థులు అయినందున తెలంగాణ విద్యార్థులు కనీసంగా 6 లక్షల వరకు ఉంటారు. వారిలో తమ టెట్ 7 ఏళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన వారు కనీసంగా 2 లక్షల మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉంది. దీంతో తమ స్కోర్‌ను పెంచుకునేందుకు టెట్‌కు హాజరయ్యే వారు మరో 2 లక్షల మందికిపైగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం టెట్‌కోసం దాదాపు 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టెట్ నిర్వహణకు అనుమతించాలని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.