ప్రైవేట్‌ పాఠశాలల్లో కట్‌ అండ్‌ పేస్ట్‌ విధానం

తల్లిదండ్రుల మెప్పుకోసం ప్రోగ్రెస్‌ కార్డుల్లో మార్కులు

విద్యార్థుల సృజనను వెలికితీసే విధానాలకు స్వస్తి

హైదరాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాలల్లో కట్‌ అండ్‌ పేస్ట్‌ విధానం కొనసాగుతోంది. పిల్లలో సృజనాత్మకతకు పెద్దగ ఆప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పాఠశాలలే సక్రమ విద్యావిధానంలో ముందున్నాయి. పిల్లలకు కావాలనే ప్రోగ్రెస్కార్డుల్లో మార్కులు వేసి తల్లిదండ్రులను సంతృప్తి పరచే విధానం అవలంబిస్తున్నారు. ఇకపోతే మరో ప్రధాన లోపం ప్రైవేట్‌ పాఠశాలల్లో కనిపిస్తోంది. తల్లిదండ్రుల మెప్పుకోసం, పాఠశాలల పనితీరు బాగుందని చెప్పుకోవడానికి మార్కులను ఇష్టం వచ్చినట్లుగా ఎక్కవ వేసి చూపుతున్నారన్న విషయం తేలింది.ఈ దశలో విద్యార్థుల్లో ప్రతిభ వెలికిరావడం లేదు. పరీక్షల నిర్వహణ తో పాటు మార్కుల కేటాయింపులో ప్రైవేట్‌ పాఠశాలల్లో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. లఘుపరీక్షలను ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 70శాతం వరకు సామర్థ్యాల ఆధారంగా నిర్ణీత పద్ధతిలో నిర్వహిస్తుండగా, ప్రైవేట్‌ పాఠశాలల్లో పూర్వపు యూనిట్‌ టెస్టుల మాదిరిగా నిర్వహిస్తున్నారు. 80శాతం పాఠశాలల్లో అందరికీ ఒకే రకంగా మార్కులను కేటాయిస్తున్నారు. సీసీఈ పద్ధతిలో కాకుండా పాఠశాలల ఇష్టానుసారం ప్రోగ్రెస్‌ రిపోర్టుల పేరుతో మార్కులు వేసి పంపుతున్నారు. చాలా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులందరూ ఉపాధ్యాయులు చెప్పిందే రాశారు. అంటే బట్టీ విధానం స్పష్టంగా బయటపడింది. విద్యార్థులు స్వయంగా ఆలోచించి, సమాచారం సేకరించి రాయాల్సి ఉన్నా ఆ దిశగా ఆలోచన చేయలేదు. కొన్ని పాఠశాలల్లో మూస పద్దతిలో ప్రశ్నలు ఇస్తున్నారని, దీని వల్ల ప్రయోజనం లేదని ధ్రువీకరించారు. పాఠ్యాంశాలను వారికి సక్రమంగా

బోధించడం లేదు. ప్రాజెక్టుల విషయంలో విద్యార్థులు ఇదే పంథా కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుల ప్రజంటేషన్‌ సక్రమంగా నిర్వహించడం లేదు. దీనికితోడు బట్టీ విధానం విద్యార్థుల్లో సృజనను బయటకు తీయడం లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పోలిస్తే ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు చురుకుగా వ్యవహరించడం లేదు. జనరల్‌ నాలెడ్జ్‌ విషయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగైన పద్దతి అవలంబిస్తున్నారు. ఒక్క ఇంగ్లీష్‌ బోధన సక్రమంగా ఉంటే ప్రైవేట్‌ కన్నా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉంటాయి. దీనికితోడు ప్రైవేట్‌ విద్యార్థులు ఎక్కువగా ఇంటర్‌నెట్‌పై ఆధారపడుతున్నారు. అందుకే ప్రయోగాల విషయంలో కట్‌ అండ్‌ పేస్ట్‌ పద్ధతికి అలవాటు పడుతున్నారు. టీచర్లే దీనిని ప్రోత్సహిస్తున్నారు. ఇదే విధానంలో ప్రాజెక్టులు చేస్తున్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాజెక్టు పనులు సృజనాత్మకంగా ఉన్నాయని గుర్తించారు ఇక్కడి విద్యార్థులు 50 శాతం సృజనాత్మకతతో ప్రాజెక్టులు రూపొందిస్తున్నారని, నివేదికలు రాస్తున్నారని, కోరినప్పుడు వాటి గురించి వివరిస్తున్నారని పరిశీలనలో తేలింది. డిజిట్‌ పాఠాలు, మన టీవీ కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫాలో అవుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో నామమాత్రం గానే ఉంది. అధిక ప్రైవేట్‌ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు జరగడంలేదు. పాఠ్య ప్రణాళికలు కొంతమేర ప్రభుత్వ పాఠశాలల్లో అమలవు తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో అదీలేదు. ప్రైవేటు పాఠశాలల్లో 30శాతమే ప్రయోగాలు చేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో సమకాలిన అంశాలకు, ప్రాజెక్టులకు తేడా లేకుండా అందరు విద్యార్థుతో ఒకేలా రాయిస్తున్నారు. భాషా పాఠ్యాంశాల్లో పుస్తక సవిూక్ష నిర్వహించి మార్కులు కేటాయించడంలో ప్రభుత్వ పాఠశాలల్లో 60 శాతం అమలవుతుండగా, ‘ప్రైవేట్‌’లో 30 శాతమే అమలవుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడంలో, సమాధాన పత్రాలను తల్లిదండ్రులకు చేరవేయడంలో వెనుకబడ్డారు. ప్రైవుటే పాటశాలల్లో విద్య మిధ్య అన్న నిజాన్ని అధికారులు గుర్తించారు. చాలాచోట్ల బట్టీ విధానం తప్ప పిల్లలకు అవగమయ్యే రీతిలో బోధించడం లేదని గుర్తించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులే మెరుగైన సామర్థ్యాలు కనబరిచారు. కొన్ని పాఠశాలల్లో అక్షరాలను కూడా గుర్తించలేకపోయారు. వేలల్లో ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల్లో పదకొండింటిలో మాత్రమే కనీస సామర్థ్యాలు కనిపించాయి. పలు ప్రైవేటు పాఠశాలల్లో శిక్షణ, అనుభవం లేని ఉపాధ్యాయులతోనే నెట్టుకొస్తున్నారని విద్యాశాఖ నిర్వహించిన సీసీఈ అమలు తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. పలు ప్రైవేటు పాఠశాలల్లో గైడ్లు, పుస్తకాల పైనే ప్రధానంగా ఆధార పడుతున్నట్లు గుర్తించారు. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారే తప్ప విద్యార్థులకు అర్థమవుతుందో లేదో పట్టించుకోవటం లేదు.