ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజులపై నియంత్రణ

కమిటీతో ఇక పర్యవేక్షణ 
జనగామ,మే12(జ‌నం సాక్షి): ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలకు చెక్‌ పెడుతూ వస్తున్న ప్రభుత్వం ఫీజుల వసూళ్లపై డీసీఈబీ కమిటీ ద్వారా నిఘా పెట్టింది. ఇప్పటికే స్కూల్‌ బ్యాగుల బరువుపై నిబంధనలు విధించిన విద్యాశాఖ ఈవిద్యా సంవత్సరం ఆరంభంలో ఫీజుల నియంత్రణపైనా దృష్టి సారించింది. ఇందులోభాగంగా డీసీఈబీ ఏర్పాటుతో పాటు ఫీజుల వసూళ్లకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఎటువంటి పరీక్ష ఫీజులు వసూలు చేయరాదు. ఆరో నుంచి 8వ తరగతి వరకు రూ. 60లు పరీక్ష ఫీజు వసూలు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది, పది తరగతులకు రూ. 60 చొప్పున, అదే ప్రైవేటు పాఠశాలల్లో అయితే రూ. 80లు వసూలు చేయాలి. ఇంతకన్నా ఎక్కువ ఫీజులను వసూలు చేస్తే చర్యలు తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది. ఫీజుల వసూలు మార్గదర్శకాలు ఇప్పటికే ఆయా పాఠశాలలకు అందాయి. మరోవైపు  కామన్‌ పరీక్షల నిర్వహణ, నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాల పునర్విభజన తర్వాత పాత జిల్లాలకు పరిమితమైన డిస్టిక్ట్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డును (డీసీఈబీ) కొత్త జిల్లాలకు కూడా విస్తరించింది. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) చైర్మన్‌గా మొత్తం 16 మందితో డీసీఈబీ కమిటీ ఏర్పాటైంది. జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో పరీక్షల నిర్వహణ, ఫీజుల నియంత్రణ డీసీఈబీ కమిటీ చేతికి వెళ్లింది. ఫలితంగా పరీక్షల నిర్వహణలో డిస్టిక్ట్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు కీలక పాత్ర పోషిస్తుంది. డీఈవో చైర్మన్‌గా ఉన్న కమిటీ పర్యవేక్షణలోనే జిల్లాలో పరీక్షలు నిర్వహించనున్నారు. డిప్యూటీ ఈవో వైస్‌ చైర్మన్‌గా, అనుభవం ఉన్న ప్రధానోపాధ్యాయుడిని సెక్రటరీగా మొత్తంగా 16 మందితో కమిటీ బాధ్యతలు తీసుకుంది. కమిటీ ద్వారానే జిల్లాలోని పరీక్షల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. నగామ జిల్లాకు డిస్టిక్ట్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు (డీసీఈబీ)ని 16 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. జిల్లాలోని పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటైన దీనికి డీఈవో యాదయ్య చైర్మన్‌గా, వైస్‌ చైర్మన్‌గా డిప్యూటీ ఈవో వ్యవహరిస్తారు.