ప్లాస్టిక్ వాడకంపై ప్రచార బేరీ
ఉత్పత్తులపై ఆంక్షలు విధించాలంటున్న ప్రజలు
వ్యాపారులదీ అదేమాట
మెదక్,డిసెంబర్4(జనంసాక్షి): పర్యావరణానికి ముప్పు తెచ్చే ప్లాస్టిక్ వాడకం నుంచి ప్రజలను దూరం చేసేందుకు జిల్లాలో ప్రచారం ఉధృతం అయ్యింది. ఎక్కడిక్కడ ప్లాస్టిక్ వాడొద్దని ప్రచారం చేస్తున్నారు. అయితే ప్లాస్టిక్ ఉత్పత్తులు రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ముందుగా ఉత్పత్తి ఆపే యత్నాలు చేయకుండా నిషేధంపై మాట్లాడితే లాభం లేదని అంటున్నారు. ప్లాస్టిక్ వాడొద్దని విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణాలలో ప్లాస్టిక్ వాడకం, అమ్మకాలపై చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. పూర్తిగా ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో మున్సిపల్ అధికారులు ప్రచారంచేపట్టారు. దీంతో ప్లాస్టిక్ వాడకంపై నిత్యం ప్రజలలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే వ్యాపారులు కూడా ప్లాస్టిక్ కవర్లలో సామగ్రిని, సరుకులను ఇవ్వడం మానుకోవాలని ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సూచించారు. గతంలో కూరగయాలతో పాటు కిరాణా సామగ్రి, ఇతర వస్తువులు తీసుకురావడానికి ఇంటి నుంచి ప్రత్యేకంగా సంచి తీసుకుని వెళ్లేవారు. కాలక్రమం లో ప్లాస్టిక్ వాడకం పెరిగి పాత పద్ధతులకు స్వస్తి పలికారు. దీంతో దేశవ్యాప్తంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండడంతో ప్లాస్టిక్‌ను ప్రజలకు దూరం చేయాలని పాలకులు నిర్ణయించారు. పట్టణాల్లో ప్లాస్టిక్ కవర్ల వాడకం పూర్తిగా మానుకోవాలని సూచించారు. గడువు తర్వాత ఎ/-లాస్టిక్ కవర్లు వాడినట్లు కనిపిస్తే సంబంధిత వ్యాపారులకు రూ.500 నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించేందుకు కూడా మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్‌కు సన్నద్ధమవుతున్నారు. దీంతో వ్యాపారులు ఇప్పటికే ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించడంతో ప్రజలు కూడా సంచులు, బ్యాగులతో దుకాణాలకు వెళ్తున్నారు. ఇప్పటివరకు మాంసం దుకాణాలకు కూడా ఉత్త చేతులతో వెళ్లి ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకునేవారు. ప్లాస్టిక్ కవర్ల నిషేధంతో టిఫిన్ బాక్సుల్లో మాంసం తెచ్చుకుంటున్నారు. కూరగాయల వ్యాపారులు కూడా ప్లాస్టిక్ కవర్లు వాడితే భారీగా జరిమానా ఉంటుందని ప్రచారం జరుగుతుండటంతో నెమ్మదిగా మానేస్తున్నారు. అయితే మరికొందరు వ్యాపారులు మాత్రం తమపై ప్రతాపం చూపే బదులు తయారుచేసే కంపెనీలనే మూసివేస్తే ఇబ్బంది ఉండదు కదాని నిట్టూరుస్తున్నారు. ఏదేమైనా మార్చేందుకు మున్సిపల్ చేస్తున్న కసరత్తుకు ప్రజలు కూడా సహకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేసినా సరైన నియంత్రణ లేకపోవడంతో కొన్ని రోజులు వ్యాపారులు మానుకున్నా ఆ తర్వాత మళ్లీ ప్లాస్టిక్ కవర్లను వాడటం మొదలుపెట్టారు. దీంతో ఈసారి కవర్లను వాడకుండా పకడ్బందీగా మున్సిపల్ అధికారులు నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.