*ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్యక్ర‌మంలో పాల్గొన్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ బ్యూరో, జూన్ 7:  జనంసాక్షి,,    పల్లెలు, పట్టణాలలోని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశం తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.   ప‌ట్ట‌ణ ప్ర‌గతి కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌జాప్ర‌తినిదుల‌తో క‌లిసి  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మంగ‌ళ‌వారం  ఆస్ర కాలనీ, విజయ నగర్ కాలనీలలో పాద‌యాత్ర చేశారు. కాల‌నీల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించి, కొత్త పనులపై చర్చించారు.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  8 ఏండ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం  ఎంతో అభివృద్ధి చెందింద‌న్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలు లబ్ధిపొందేలా పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌, ఆసరా పింఛన్‌, హరితహారం,మన ఊరు- మన బడి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతులు, వికలాంగులకు ఆసర పథకం అండగా నిలుస్తోంద‌ని, వృద్ధ్యాప్య పింఛన్ల వయోపరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించామని, త్వ‌ర‌లో వారికి ఫించ‌న్లు అంద‌జేస్తామ‌ని తెలిపారు.   తెలంగాణ రాష్ట్రంలో క‌రెంట్, తాగు, సాగునీటి స‌మ‌స్య లేద‌న్నారు. స్వంత స్థ‌లంలో డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించుకునే వారికికి  ప్ర‌భుత్వం రూ. 3 ల‌క్ష‌లు  ఆర్థిక స‌హాయం అంద‌జేస్తుంద‌న్నారు.  తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్క‌డ కూడా ఇలాంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.