ఫలక్ నుమాలో పోలీసులు తనిఖీలు
హైదరాబాద్ : నగరంలో పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎప్పుడు..ఎక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తారోనని రౌడీషీటర్లు..దొంగలు..అక్రమార్కులు భయ పడుతున్నారు. తాజాగా ఫలక్ నుమా పీఎస్ పరిధిలోని ఫాతిమానగర్, వట్టేపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. 350 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో 34 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అంతేగాకుండా 110 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, 300 లీటర్ల కిరోసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. గాజుల పరిశ్రమలో పనిచేస్తున్న 21 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. వీరిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పేదలకు అందాల్సిన సరుకులను అక్రమంగా తరలిస్తున్న ముఠా సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ పేర్కొన్నారు. ముఠాలో కీలకంగా ఉన్న వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని పేర్కొన్నారు. పరిశ్రమల్లో బాలలచే పనిచేయించవద్దని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.