ఫసల్ బీమాతో లబ్ది పొందాలి
మహబూబాబాద్,డిసెంబర్2(జనంసాక్షి): రైతులు ప్రతిపంటకు బీమా చేయించుకొని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లినప్పుడు పరిహారం పొందాలని ఆర్డీవో భాస్కర్‌రావు అన్నారు. బీమా చేసిన రైతులు పంట నష్టం జరిగినప్పుడు వెంటనే అధికారులకు తెలియపర్చాలని సూచించారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని పరిహారం అందించడం జరుగుతందని అన్నారు. యాసంగి సాగు చేసే రైతులు తమ పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే జిల్లా వ్యాపితంగా ఫసల్‌బీమాపై ఏఈవోలు, రైతు సమన్వయ సమితి సభ్యుల ద్వారా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులు అకాల వర్షాలు, వడగండ్ల వానలు వంటి ప్రకృతి వైఫరిత్యాలు సంభవించినప్పుడు పంట నష్టం జరిగిన రైతులను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అమలు చేస్తుందన్నారు.
రైతులు డిసెంబర్ 15లోపు బీమా చెల్లించాలని ఆయన కోరారు. ఇకపోతే రైతులు సేంద్రియ విధానంతో పంటలు సాగు చేస్తే ఆరోగ్యకరమైన పంటలు, ఆశించిన దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయాధికారులు అన్నారు. సేంద్రియ ఎరువులు తయారుచేసుకుని వాడకం వల్ల భూముల్లో సారం పెరిగి చీడపీడ బెడద
పోతుందని అన్నారు. ఫలితం రెట్టింపు అయ్యే అవకాశముందన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అ ధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో బాగంగానే భూరికార్డుల ప్రక్షాళణ చేపట్టిందన్నారు. అంతే కాకుండా ఎకరానికి రూ. 4 వేలు అందించేందు కు చర్యలు తీసుకుంటుందన్నారు.రైతులందరూ ప్రధాన మంత్రి ఫసల్‌భీమా యోజన పథకంలో భీమా చేయాలన్నారు.. ఇందుకుగాను మిర్చి, జొన్న, వరి, వేరుశనగ డిసెంబర్ 31, మొక్కజొన్నకు డిసెంబర్ 15 చివరి తేదీ వెల్లడించా రు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.