ఫార్మాసిటీకి నిధులివ్వండి
– కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేేఖ
హైదరాబాద్,డిసెంబరు 23 (జనంసాక్షి): తెలంగాణలోని పారిశ్రామిక కారిడార్ సహా ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, నేషనల్ డిజైన్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆయన లేఖ రాశారు. రెండు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి రూ.5వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రెండింటిని ఫాస్ట్ ట్రాక్ విధానంలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని.. ప్రాజెక్టు వ్యయంలో కనీసం సగం మొత్తాన్ని 2021-22 కేంద్ర బడ్జెట్ లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మారంగంలో దేశ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసేలా మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ తరహాలో ప్రపంచంలోనే పెద్దదైన సవిూకృత ఫార్మా పార్కుగా హైదరాబాద్ ఫార్మాసిటీని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అత్యున్నత ప్రమాణాలు, సీఈటీపీ, సవిూకృత వ్యర్థాల నిర్వహణ, ఫార్మా వర్సిటీ, ప్రయోగశాలలు, అంకురాలు, ఎస్‌ఎంఈ హబ్‌లతో కూడిన మొదటి ఫార్మాసిటీగా ఇది నిలుస్తుందన్నారు. ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటికే నిమ్జ్ ¬దా ఇచ్చిందన్న కేటీఆర్… పలు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఫార్మాసిటీ ద్వారా రూ.64వేల కోట్ల పెట్టుబడులు, 5.5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని లేఖలో ఆయన వివరించారు. జాతీయ ప్రాధాన్యత ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీకి ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. ప్రాజెక్టుకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.4,922 కోట్లు ఇవ్వాలని.. రానున్న బడ్జెట్‌లో కనీసం రూ.870 కోట్లు కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ నిమ్జ్‌కు 2016లో తుది అనుమతులు వచ్చాయని.. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.9,500 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బడ్జెట్లో కొంత ఆర్థిక సాయం అందించాలని కోరారు. మొదటి దశలో రూ.500 కోట్లు కేటాయించాలని గతంలోనే కోరినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కేటీఆర్ కేంద్రమంత్రిని కోరారు. దీనికి సంబంధించిన డీపీఆర్ తయారీపై కేంద్ర ప్రభుత్వంతో అధికారులు కసరత్తు చేస్తున్నారని.. గచ్చిబౌలిలో 30 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డిజైన్ సెంటర్ ఏర్పాటు కోసం సుమారు రూ.200 కోట్ల రూపాయల ప్రాథమిక మూలధనాన్ని బడ్జెట్లో కేటాయించాలని లేఖలో కోరారు.