ఫార్మాసిటీకి రుణమివ్వండి..చేనేతకు చేయుతివ్వండి
– వెంకయ్య, ఉమాభారతిలకు కేటీఆర్ వినతి
న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి): రాష్ట్రంలో ఫార్మాసిటీ ప్రాజెక్టుకు హడ్కో ద్వారా రూ.785కోట్ల రుణ సహాయాన్ని అందించాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కెటిఆర్ బుధవారం ఉదయం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయంపై మంత్రికి విన్నవించారు. వెంకయ్యనాయుడుతో కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు.అనంతరం కేటీఆర్ విూడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనకు ఎన్‌ఆర్‌పీ ద్వారా రూ.900కోట్లు మంజూరు చేయాలని కోరామన్నారు. హైదరాబాద్‌లో స్కైవేలు, ఎస్‌ఆర్‌బీపీల గురించి మంత్రికి వివరించి.. మురుగునీటి వ్యవస్థ, రోడ్ల అభివృద్ధి కోసం కేంద్ర సహాయాన్ని కోరినట్లు చెప్పారు. దీంతో పాటు బ్రిక్స్ నుంచి రూ.75వేల కోట్ల రుణానికై చొరవ చూపాలని కోరినట్లు వెల్లడించారు. త్వరలోనే దీనిపై సమావేశం ఏర్పాటుచేసి చర్చిద్దామని వెంకయ్యనాయుడు అన్నట్లు కేటీఆర్ తెలిపారు. ఫార్మాసిటీకి హడ్కో ద్వారా రూ. 785 కోట్లు ఇప్పించాలని వెంకయ్యనాయుడిని కోరామని తెలిపారు. ఎన్‌ఆర్‌పీలో భాగంగా రూ. 930 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కాలుష్యరహిత ఫార్మాసిటీని హైదరాబాద్‌లో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. చైనా ప్రమాణాలతో ఫార్మా సిటీ నిర్మాణం జరుగుతదన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కెటిఆర్ వివిధ దేశాధినేతలను కలసి పెట్టుబడులకు ఆహ్వానించారు. దేశంలోనే ఉత్తమమైన ఫార్మాసిటీని నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని రుణం రూపంలో ఇవ్వాలని మంత్రి కేటీఆర్ హడ్కో చైర్మన్‌ను కోరారు. ఫార్మాసిటీ నిర్మాణానికి, భూసేకరణకు రూ. 745 కోట్లు అవసరమని తెలిపారు. తన ప్రతిపాదనపై హడ్కో చైర్మన్ రవికాంత్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే దానికి సంబంధించిన నిర్ణయం వెలువడుతుందని, ఆ తర్వాత ఒప్పందం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. గృహనిర్మాణ బోర్డు డైరెక్టర్ జనరల్ కూడా సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి తెలంగాణలో అపారమైన సానుకూలతలు ఉన్నాయని, వాణిజ్య విస్తరణకు తమ రాష్ట్రాన్ని ఎంచుకోవాలని పలు దేశాల రాయబారులకు వివరించారు. జపాన్, మలేషియా, తైవాన్, దక్షిణ కొరియా దేశాల ప్రతినిధులతోపాటు కేంద్ర చిన్న-మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా, హడ్కో సీఎండీ, గృహనిర్మాణ బోర్డు డైరెక్టర్ జనరల్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశాల ఫలితంగా మలేషియా పారిశ్రామికవేత్తల బృందం వచ్చే నెలలో హైదరాబాద్‌లో పర్యటించనుంది. తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పనున్న డాటాబేస్ క్యాంపస్‌కు తగిన సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌కు చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన లభించింది. ఫార్మాసిటీ నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు హడ్కో కూడా సానుకూలంగా స్పందించింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలను స్థాపించడానికి ఉన్న అవకాశాలను, పరిస్థితులను ఆయా దేశాల రాయబారులకు వివరించానని తెలిపారు. మన రాష్ట్రం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానాన్ని, పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉన్న పరిస్థితులను వివరించానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో డాటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నదని, ఇందులో ఎయిర్‌టెల్‌ను యాంకర్ క్లయింట్, పార్టనర్‌గా ఉండాలని భారతి ఎయిర్‌టెల్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ మిట్టల్‌ను కోరానని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన వెంటనే ఐటిశౄఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ కూడా
ఉన్నారు.
స్మృతి ఇరానీతో కేటీఆర్ భేటి
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానితో మంత్రి కేటీఆర్, టిఆర్‌ఎస్ ఎంపీలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలు, వాస్తవ పరిస్థితులను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని గతంలో సిఎం కేసీఆర్ హావిూ ఇచ్చారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఆ ప్రారంభోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్ ప్రధానిని ఆహ్వానించారని తెలిపారు.కార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్, నారాయణ పేటలోని సమస్యలను లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రికి అందజేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కార్మికుల కష్టాలను తెలుసుకునేందుకు త్వరలోనే తెలంగాణకు వస్తానని కేంద్ర మంత్రి స్మృతి హావిూ ఇచ్చారని తెలిపారు. ఆ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహిస్తామన్నారు. టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుపై ప్రధానికి ఇచ్చిన ప్రణాళికనే కేంద్ర జౌళి శాఖకు ఇవ్వాలని మంత్రి కోరారని చెప్పారు.తెలంగాణలో ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్, రిజర్వాయర్ల నిర్మాణం విషయంలో హర్యానలోని ప్రాజెక్టులతో పోలుస్తూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న అసంబద్ధ వాదనలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ, హర్యాన భౌగోళిక పరిస్థితుల్లో చాలా తేడా ఉందన్నారు. కాంగ్రెస్ నేతల అజ్ఞానం, అపరిపక్వతకు చరిత్రలో ఎన్నో పుంకాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. 60 ఏళ్లు పాలించినా ఏం చేయని అసమర్థులు కాంగ్రెస్ నేతలని, తెలంగాణ సాధించి చరిత్ర గుర్తించదగ్గ వ్యక్తి సీఎం కేసీఆర్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కాదు, స్కాంగ్రెస్ పార్టీ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఆకాశం, పాతాళాన్ని కూడా స్కాం చేశారని మండిపడ్డారు.రాష్ట్రంలోని ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ పై అసెంబ్లీలో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు తోక ముడిచారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు విూడియాలో ప్రచారం కోసం యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులను కాదు, ముందుగా కాంగ్రెస్ నాయకుల మైండ్లను రీడిజైన్ చేయాలని వ్యాఖ్యానించారు.ప్రత్యేక ¬దాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో పెట్టే ప్రైవేట్ మెంబర్ బిల్లుకి మద్ధతిస్తామని తాను అనలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై ఎవరైనా బిల్లు పెడితే మద్ధతిస్తానని మాత్రమే చెప్పానన్నారు. కేసీఆర్ తెలంగాణ ఎలా సాధించారో కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. 36 పార్టీలను ఒప్పించి ఏకాభిప్రాయం సాధించి తెలంగాణ సాధించారని గుర్తుచేశారు. ప్రైవేటు మెంబరు బిల్లులతో ఏమి ఒరుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి, ఇంగితజ్ఞానం ఉంటే అన్ని పార్టీలతో సంప్రదించాలని సూచించారు. ఇలాంటి గిమ్మిక్కులతో ప్రజలను మభ్యపెట్టగలం అనుకుంటే అది వారి తెలివితక్కువ తనం అవుతుందన్నారు.కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిసిన వారిలో మంత్రి కేటీఆర్ తో పాటు టిఆర్‌ఎస్ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, సీతారాం నాయక్, బాల్క సుమన్, పసునూరి దయాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.