ఫిలింనగర్‌లో కుప్పకూలిన భవంతి

2

– ఇద్దరు మృతి

హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి):ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి అపోలో ఆస్పత్రికి తరలించారు. మృతులను పశ్చిమ బంగాకు చెందిన ఆనంద్‌(24), అన్సూర్‌ షేక్‌(30)గా గుర్తించారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను ప్రొక్లెయినర్‌ సాయంతో తొలగించారు. నిర్మాణంలో ఉన్న భవనాన్ని విస్తరించే క్రమంలో 10 పిల్లర్లు కూలడంతో ప్రమాదం జరిగింది. ఈ భవన నిర్మాణం సుమారు రెండు నెలల నుంచి జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, భాజపా నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్‌, చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు భట్టి విక్రమార్క, నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, తెదేపా నేతలు ఎంఎల్‌ శ్రీనివాస్‌, మేకల సారంగపాణి తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఫిలింనగర్‌ విషాదం.. పలువురిపై కేసులు

హైదరాబాద్‌: ఫిలింనగర్‌లోని భవనం కుప్పకూలిన ఘటనలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ అధ్యక్షుడు కె.ఎస్‌.రామారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, భవన నిర్మాణ ఇంజినీర్‌ సుధాకర్‌రావు, గుత్తేదారు కొండలరావులపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 304ఏ, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాంగ్రెస్‌ ఆందోళన

యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘటనా స్థలం వద్ద ఆందోళన చేపట్టారు. బాధ్యులను అరెస్టు చేసి.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆ భవనానికి అనుమతులు లేవు

కల్చరల్‌ క్లబ్‌ వద్ద నిర్మిస్తున్న భవనానిని అనుమతులు లేవని జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఆ స్థలం ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉన్నట్లు వెల్లడించారు.

అది అక్రమ నిర్మాణం: మంత్రి

ఫిలింనగర్‌లో కూలిన భవనం అక్రమ నిర్మాణమేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండానే భవనం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పనులు నాసిరకంగా చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని.. బాధ్యులపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటుందన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హావిూ ఇచ్చారు.

రూ.2లక్షల పరిహారం

ఫిలింనగర్‌లో భవనం కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. గుత్తేదారు నాసిరకం పనులు చేయడం వల్లే భవనం కూలిందని తెలిపారు. భవన నిర్మాణానికి ఫిలింనగర్‌ సొసైటీ, జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకోలేదన్నారు. కేవలం 48 గంటల్లోనే శ్లాబ్‌ వేయడంతో కూలిపోయిందని తెలిపారు. ఈ ఘటనకు కారణమైన గుత్తేదారు సహా బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.