ఫీజులు పెంచొద్దు..కౌన్సెలింగ్ చేపట్టండి : ఎబివిపి
హైదరాబాద్, ఆగస్టు 2 (జనంసాక్షి) : ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని గురువారం ఉదయం ఎబివిపి విద్యార్థులు ముట్టడించారు. ఇంజనీరింగ్ ఫీజులను పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపొద్దంటూ నినాదాలు చేశారు. పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ ఫీజును 50వేల రూపాయలుగా నిర్ణయించడం సరైంది కాదన్నారు. అంత మొత్తం చెల్లించే స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు లేరన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలామంది సాంకేతిక విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. ఎప్పుడో జులైలోనే ప్రారంభించాల్సిన కౌన్సెలింగ్ నేటికీ చేపట్టకపోవడం విచారకరమన్నారు. విద్యార్ధుల భవిష్యత్తుతో ఉన్నత విద్యామండలి ఆడుకుంటోందని దుయ్యబట్టారు. ఫీజు పెంచొద్దని, వెంటనే కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఇదిలా ఉండగా ధర్నా నేపథ్యంలో మసాబ్‌టాంక్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దారు.