ఫోటోగ్రఫీ చెదరని జ్ఞాపకం
* వీడియో, ఫోటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
— బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
ఫోటోగ్రఫీ చెదరని జ్ఞాపకం, మధుర స్మృతులని, ఫోటో చిత్రాలు జ్ఞాపకాలుగా, తీపి గుర్తుగా నిలుస్తాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర కవరేజ్ ఫోటో, వీడియో జర్నలిస్టులతో కలిసి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇట్టి సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫోటోగ్రాఫర్ లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. మనిషి జీవన శైలిలో ప్రతిరోజు మధుర జ్ఞాపకమని, అలాంటి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు భద్రంగా దాచుకోవడానికి, చెదిరిపోని స్మృతులకు ఫోటో చిత్రాలు ప్రతిబింబాలుగా నిలుస్తాయన్నారు. సమాజంలో ఫోటో, వీడియోగ్రఫీ ఒక ప్రత్యేక స్థానం ఉందని, కానీ, ఈ వృత్తిలోని వారు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా పత్రికా రంగంలోని ఫోటో, వీడియో జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. తెలంగాణలో రాబోయే బీజేపీ ప్రభుత్వంలో ఫోటోగ్రాఫర్ల సమస్యలన్నీ పరిష్కరించి ఆదుకుంటామని ఈ సందర్భంగా బండి సంజయ్ హామీ ఇచ్చారు.