ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల కోత

41469774929_625x300బెంగళూరు: ఇటీవల  ప్రముఖ ఫ్యాషన్  రీటైలర్,  వ్యాపారంలో ప్రధాన పత్యర్థి జబాంగ్ ను విలీనం చేసుకుని వార్తలో నిలిచిన ఫ్లిప్ కార్ట్   మరో కీలక నిర్ణయం  తీసుకుంది. అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ గా ఉన్న  ఫ్లిప్ కార్ట్ భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత పెడుతున్నట్టు సమాచారం. సుమారు 700 నుంచి  1000 దాకా ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. సంస్థకు సన్నిహితమైన కీలక వ్యక్తులు అందించిన సమాచారం ప్రకారం  ఆయా ఉద్యోగులను రాజీనామా చేయమని చెప్పడం కానీ కొత్తమొత్తంలో  డబ్బులు చెల్లించి సంస్థనుంచి  పంపించడం కానీ చేయనుంది.  ప్రొఫెషనల్ అంచనాలను  అందుకోలేని ఎంపిక చేసిన ఉద్యోగులపై వేటు వేయనుంది. కంపెనీ పొదుపు చర్యలు,  ఆదాయ వృద్ధిలో సమన్వయంలో భాగంగా   ఈ నిర్ణయం తీసుకుంది.

ఆన్ లైన్ రీటైల్  పరిశ్రమలో పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడడమే  ప్రధాన ధ్యేయంగా ఫ్లిప్ కార్ట్ అడుగులు వేస్తోందని వారు తెలిపారు.  అయితే   ఒక సంస్థలో అదనపు భారం పేరుతో ఉద్యోగులను తొలగించే  సంస్కృతి,  గోల్స్ పై దృష్టి  తదితర అంశాలు ఉద్యోగులకు మంచి పరిణామం కాదని ఎనలిస్టులు  అభిప్రాయపడ్డారు.  ఒక నిర్దిష్ట వ్యక్తి  వైఫల్యానికి సంబంధించి నిజాలు, వాస్తవ డేటా ఆధారంగా మేనేజర్ల నిర్ణయాలు ఉండాలని వెంగర్ అండ్ వాట్సన్  మేనేజింగ్ పార్టనర్ హరీష కుమార్ చెప్పారు.

కాగా  ప్రస్తుతం సంస్థలో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నైపుణ్యాలను పెంచుకునే అవకాశాన్ని ఆయా ఉద్యోగులకు కల్పించినప్పటికీ ఫలితాలు రాలేదని  కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  ఉద్యోగుల పరిస్థితిలో “ప్రోగ్రెస్” లేదనీ, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని, బయట వారి అర్హతలకు తగిన అవకాశాలను వెతక్కోవాలని ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఇది నేరుగా ఎంతమంది ఉద్యోగులు ప్రభావితం చేయనుందనేది ఇపుడే చెప్పలేమని పేర్కొంది.

కాగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా బిన్నీ బన్సాల్  బాధ్యతలను చేపట్టిన తరువాత  కంపెనీ లాభాల  బాట పట్టింది. మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు  కూడా భారీగా సాగుతున్నాయి.  దీంతోపాటుగా ఈ ఏడాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్  విద్యార్థుల నియామకంపై  కొన్ని విమర్శలు  ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.