‘బంగారు తెలంగాణ’వాది కొండా మురళీ ఏకగ్రీవం

3

– ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణి

వరంగల్‌,డిసెంబర్‌ 10(జనంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ బోణీ కొట్టింది. ఆ పార్టీ వరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి, బంగారు తెలంగాణ వాది కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.వరంగల్‌ ఉప ఎన్నికల తరవాత జరుఎగుతన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసీటును వరగంల్‌ నుంచే గెలుపొందడం విశేషం. మాజీ ఎమ్మెల్సీ,టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కొండా మురళి ఇక్కడి నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నారు. దీంతో ఆ ఎమ్మెల్సీ స్థానం టీఆర్‌ఎస్‌ వశమైంది. ఈ స్థానానికి ఇండిపెండెంట్లు మినహా ఇతర రాజకీయ పార్టీలు చేతులెత్తేశాయి. ఆ పార్టీలు నామినేషన్లు వేయలేదు. ఇండిపెండెంట్లు నామినేషన్లు ఉపసంహరించు కోవడంతో కొండా మురళి ఒక్కరే నామినేషన్‌ వేసినట్టయింది. అయితే కొండా మురళి ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సందర్బంగా కొండా మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాదరణ కలిగి ఉన్న నేత ఎవరైనా ఉన్నారని అంటే అది సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని అన్నారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాన్కొరే బరిలో ఉన్నారని తేలిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీకి వరంగల్‌ జిల్లా ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల వ్యక్తిగా తనకు అందరూ అండగా నిలిచారన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తుండటం వల్లే తాను ఏకగ్రీవంగా ఎన్నిక కాగలిగానన్నారు. వరంగల్‌ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ను ఢీకొనే పరిస్థితుల్లో ప్రతిపక్షాలు లేవని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకుని సీఎం కేసీఆర్‌ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి రావాలని కోరారు. వరుస గెలుపులతో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలుగానీ, కార్యకర్తలు గానీ పొంగిపోవడంలేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. గెలుపుతో తమ పార్టీపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. వరంగల్‌ జిల్లా అభివృద్దికి సీఎం కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని తెలిపారు. కలిసికట్టుగా వరంగల్‌ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని కోరారు. కాగా తెలంగాణా రాష్ట్రంలో అధికార పార్టీతన హవాను కొనసాగిస్తూనే ఉంది. నిన్నటికి నిన్న జరిగిన వరంగల్‌ ఎంపి ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ భారీ మెజార్టీతో ఎన్నిక కావడంతో అధికార పార్టీకి  ఎదురులేదనే భావన వ్యక్తం అయింది. ఈవిజయం అందించిన ఆనందం నుంచి బయట పడకముందే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. గురువారం నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు.  ఈకార్యక్రమం కొనసాగుతుండగానే వరంగల్‌లోని ఒకే ఒక్క ఎమ్మెల్సీకోసం ఆరుగురు నామినేషన్లు వేశారు. అయితే ఇందులో అయిదుగురు అభ్యర్థులు కూడా గురవారం ఉదయమే ఎన్నికల అధికారి, జేసీ జీవన్‌ పాటిల్‌ను కలిసి ఉపసంహరించుకుంటున్నట్లు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అధికారులు నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పూర్తి చేయకుండానే కార్యక్రమం ముగించేశారు. అయితే రంగంలో మిగిలింది ఒక్క టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మాత్రమే కావడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయంగా మారింది. నామినేషన్ల పర్వం కొనసాగుతుండగానే ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపి, వైసీపీ సహా అన్ని పార్టీలు కూడా నామినేషన్‌ కూడా వేయలేదు. దీంతో ఆరుగురు నామినేషన్లు వేసినవారుండేవారు. ఇందులో ఐదుగురు స్వతంత్రులు గురువారం ఉదయమే తమ తమ నామినేషన్లను ఉపసంహరిం చుకుంటున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన వారిలోఅనుమాండ్ల నరెందర్‌ రెడ్డి, దురిశెట్టి చంద్రమౌళి, జక్క మహబూబ్‌రెడ్డి, మోడెం మల్లేషం, రంగరాజు రవీందర్‌లు నామినేషన్‌ వేశారు. అయితే వీరంతా నేడే ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలన ఎన్నికల అధికారికి సమర్పించారు. షెడ్యూల్‌ ప్రకారం శనివారం వరకు అభ్యర్థులు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఆరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల అధికారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఏదిఏమైనా తెలంగాణాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఆదిపత్యాన్ని నిరూపించుకోవడం పట్ల అధికార పార్టీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా జిల్లాల్లోని పది జిల్లాల్లో కనీసం 8 జిల్లాల్లో కూడా ఏకగ్రీవంగానే ఎన్నికలు ముగియనున్నాయని సమాచారం. ఒక్క నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ లాంటి చోట్ల మినహా ఎక్కడా కూడా అధికారపార్టీకి ఎదురు నిలబడి పోటీచేసేందుకు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ముందుకు రాలేదని సమాచారం. వరంగల్‌లో పోటీలో ఉన్న అభ్యర్థులంతా నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో అథికారపార్టీ నేతలు, ప్రధానంగా కొండా దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.